ఎన్విడియా సీఈవో జెన్సన్ రాజీనామా
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:24 AM
ఎన్విడియా సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు ఎన్విడియాలోనే హెల్త్‌కేర్ విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న కింబర్లీ పావెల్‌తోనూ..
మరో మహిళతో వివాహేతర బంధం ఆరోపణల నేపథ్యంలో తప్పుకొన్న జెన్సన్ హువాంగ్
తాత్కాలిక సీఈవోగా కొలెటె క్రెస్
ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం ఉపాధ్యక్షురాలు కింబర్లీ పావెల్‌తోనూ జెన్సన్‌కు ‘బంధం’!
న్యూయార్క్‌టైమ్స్ పత్రికలో కథనం
జెన్సన్-అలిస్ ‘బంధం’ ఆమె భర్తకూ తెలుసు!
జెన్సన్‌ను సీఈవోగా తొలగిస్తే నేను చేర్చుకుంటా
టెస్లా అధినేత ఎలాన్ మస్క్
బీజింగ్‌కు వెళ్లిపోయిన అలిస్ హువాంగ్?
హాంకాంగ్ పాస్‌పోర్టుతో 8 సార్లు తైవాన్‌కు..
న్యూఢిల్లీ/వాషింగ్టన్/హాంకాంగ్, నవంబరు 12: ఎన్విడియా సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు ఎన్విడియాలోనే హెల్త్‌కేర్ విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న కింబర్లీ పావెల్‌తోనూ వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలు వ్యక్తమవడంతో గురువారం జెన్సన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తాత్కాలిక సీఈవోగా కొలెటె క్రెస్‌ను నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆమె ప్రస్తుతం కంపెనీకి కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కాగా, చైనా గూఢచారి అని ఆరోపణలు ఉన్న అలిస్ హువాంగ్‌తో జెన్సన్ వివాహేతర సంబంధం ఇప్పటికే వివాదాస్పదంగా మారగా.. తాజాగా ఆయనపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఎన్విడియాలో హెల్త్‌కేర్ విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న కింబర్లీ పావెల్(48)తో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. శాన్‌జోస్‌లో జరిగిన ఎన్విడియా సదస్సు సందర్భంగా ఓ హోటల్‌లో హువాంగ్, పావెల్ సన్నిహితంగా ఉన్న దృశ్యాలను వీడియో తీసినట్లు మాజీ ఉద్యోగులు తెలిపారని పేర్కొంది. అయితే ఆ వీడియోను తాము స్వయంగా చూడలేదని పత్రిక స్పష్టం చేసింది. కింబర్లీ పావెల్ 2008లో ఎన్విడియాలో చేరారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్విడియా హెల్త్‌కేర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఆమె కూడా వివాహితురాలేనని కథనం పేర్కొంది. కాగా, సీఈవోకు నేరుగా రిపోర్టు చేసే ఉన్నతాధికారిణితో సంబంధం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. జెన్సన్‌కు మరో మహిళతో సంబంధం, ఆయన రాజీనామా నేపథ్యంలో అమెరికా దిగ్గజ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా షేర్లు గురువారం ప్రిమార్కెట్ ట్రేడింగ్‌లో 10శాతం మేర పతనమయ్యాయి.
అలిస్ భర్తకు ముందే తెలుసు!
జెన్సన్‌తో అలిస్‌కు ఉన్న బంధం గురించి ఆమె భర్త కాంగ్‌కు ముందే తెలుసట! అంతేకాదు.. జెన్సన్‌కు అలిస్‌ను పరిచయం చేసిందే కాంగ్ కావడం ఈ వ్యవహారంలో మరో విశేషం. దాదాపు పదేళ్లుగా జెన్సన్‌తో పరిచయం ఉన్న కాంగ్.. తన భార్యతో ఆయనకు ఏర్పడిన వివాహేతర బంధం రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు అంగీకరించారని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం వెల్లడించింది. వీరిద్దరి బంధంపై తన సన్నిహితుల వద్ద కాంగ్ అప్పుడప్పుడు సరదాగా వ్యాఖ్యానించేవాడని పేర్కొంది. తన భార్య జెన్సన్‌కు వ్యక్తిగత సహాయకురాలి (పీఏ)గా వ్యవహరిస్తోందని జోకులు వేసేవాడని తెలిపింది. మరోవైపు, జెన్సన్‌తో అలిస్‌కు ఉన్న సంబంధాలు, ఆమె భర్తతో కలిసి సాగించిన వ్యాపార కార్యకలాపాలు ఇప్పుడు అమెరికా, సింగపూర్ దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నాయి.
జెన్సన్‌ను నేను చేర్చుకుంటా: మస్క్
జెన్సన్ హువాంగ్‌ను సీఈవో పదవి నుంచి తప్పించాలని ఎన్విడియా బోర్డు యోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెన్సన్‌ను తొలగిస్తే.. తన కంపెనీలో నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
బీజింగ్‌లోనే అలిస్..!
చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్ హువాంగ్ స్వదేశానికి తిరిగి వెళ్లి, ప్రస్తుతం బీజింగ్‌లో నివసిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం వెల్లడించింది. మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకురాలైన అలిస్ హువాంగ్ కదలికలపై భద్రతా వర్గాలకు సమాచారం ఉందని, అయితే ఆమె ఎప్పుడు, ఎందుకు బీజింగ్‌కు వెళ్లారన్నది స్పష్టంగా తెలియలేదని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది.
హాంకాంగ్ పాస్‌పోర్టుతో 8 సార్లు తైవాన్‌కి..!
అలిస్ హువాంగ్‌కు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె 2024, 2025 సంవత్సరాల్లో ఎనిమిదిసార్లు తమ దేశంలోకి వచ్చినట్లు తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది. హాంకాంగ్ పాస్‌పోర్టుతో సాధారణ వ్యాపార సందర్శకురాలిగా అలిస్ తైవాన్‌కు వచ్చారని ఆ దేశ మంత్రి చియు చుయ్‌చెంగ్ పార్లమెంటులో వెల్లడించారు. 2024లో మూడు సార్లు, 2025లో ఐదు సార్లు ఆమె తైవాన్‌ను సందర్శించినట్లు ఇమ్మిగ్రేషన్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఆమె తైవాన్‌లోకి ప్రవేశించినట్లు రికార్డులు లేవన్నారు. అలిస్ హువాంగ్ పర్యటనలపై 2024లోనే అమెరికా అధికారులు తైవాన్‌ను అప్రమత్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. అయితే, తమ కౌన్సిల్‌కు అలాంటి సమాచారం అందలేదని చియు స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై తైవాన్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆమె ప్రవేశ అనుమతిని రద్దు చేసినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.