కందిపప్పులో భారీ కిరికిరి!
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:08 AM
సంక్రాంతి, క్రిస్మస్ వేళ పేదలకు తక్కువ ధరకు అందాల్సిన కందిపప్పుతో పెద్దలు పండగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కందిపప్పు టెండర్లలో కిరికిరి వ్యవహారం నడిపించి రూ.750 కోట్లు జేబులో వేసుకునేందుకు పక్కా స్కెచ్ రచించారు
రూ.750 కోట్ల టెండర్లో గోల్మాల్
రేషన్‌షాపుల ద్వారా వందకే కందిపప్పు
క్రిస్మస్, సంక్రాంతి దృష్ట్యా మూడు నెలలు ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయం
అయితే, టెండర్లు నిర్వహించలేమన్న పౌర సరఫరాల కార్పొరేషన్
ఆ బాధ్యతలు కేంద్ర సంస్థ ఎన్సీసీఎఫ్కు టెండరు దక్కేలా ఓ బడా వ్యాపారి చక్రం
ఎంప్యానెల్‌లో ఆ వ్యాపారి సభ్యుడు
ఆయనకు అనువుగా టెండర్ నిబంధనలు
కాంట్రాక్టర్ల మధ్య పోటీకి తావే లేకుండా పావులు.. దీంతో వివాదంలో ‘టెండరు’
(అమరావతి - ఆంధ్రజ్యోతి): సంక్రాంతి, క్రిస్మస్ వేళ పేదలకు తక్కువ ధరకు అందాల్సిన కందిపప్పుతో పెద్దలు పండగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కందిపప్పు టెండర్లలో కిరికిరి వ్యవహారం నడిపించి రూ.750 కోట్లు జేబులో వేసుకునేందుకు పక్కా స్కెచ్ రచించారు. మరీ అడ్డగోలుగా వ్యవహారం నడిపించడంతో టెండరు ప్రక్రియ వివాదంలో పడింది. రేషన్‌షాపుల ద్వారా వచ్చే మూడు నెలలపాటు కందిపప్పుతోపాటు పామాయిల్, గోధుమ పిండిని చౌక ధరలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మార్కెట్లో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రూ.100 కే కిలో కందిపప్పు, రూ.125 కే లీటరు పామాయిల్, రూ.25 లకే కిలో గోధుమ పిండిని ప్యాకెట్ల రూపంలో రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేయాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పారదర్శకమైన పోటీ విధానంలో టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెండర్ల ప్రక్రియను నిర్వహించడం తమవల్ల కాదంటూ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చేతులెత్తేసింది. టెండర్ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్)కు అప్పగించింది. ఈ కేంద్ర సంస్థలోని ఉన్నతాధికారులతో సంబంధం ఉన్న ఓ బడా వ్యాపారి ఆ వెంటనే రంగంలోకి దిగారు. ఆయనకే టెంటరు పోయేలా ఎన్సీసీఎఫ్ సంస్థ గట్టిగా పావులు కదిపింది.
టెండర్ల నిర్వహణలో పారదర్శకత పాటించకుండా.. గోల్మాల్ వ్యవహారాలకు తెర తీసింది. కాంట్రాక్టర్ల మధ్య పోటీకి ఆస్కారమే లేకుండా చేసి.. తనతో ఎంప్యానల్ అయిన కాంట్రాక్టర్లకే టెండర్లు కట్టబెట్టేందుకు వక్రమార్గాలను అనుసరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ. 750 కోట్ల విలువైన కందిపప్పు సరఫరాకు సంబంధించిన టెండరు విషయంలో ఎన్సీసీఎఫ్, విశాఖపట్నం బ్రాంచి అధికారులు వ్యవహరించిన తీరు ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
అడ్డగోలు నిబంధనలు
టెండరులో పాల్గొనే బిడ్డర్ల అర్హతలను అసాధారణ రీతిలో నిర్ణయించారు. అవి..
టెండరులో పాల్గొనే సంస్థలకు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పప్పు ధాన్యాల వ్యాపారంలో వార్షిక టర్నోవరు కనీసం 300 కోట్లు ఉండాలి. ఈ మేరకు సీఏ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
సొంత లేదా లీజుకు తీసుకున్న మిల్లులు ఉండి, గడచిన మూడేళ్లలో ఏదైనా ఒక ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు కనీసం 45 వేల టన్నుల పప్పు ధాన్యాలను సరఫరా చేసిన అనుభవం ఉండాలి.
మిల్లింగ్ సామర్థ్యం రోజుకు కనీసం 450 మెట్రిక్ టన్నులు ఉండాలి.
రూ. 90 కోట్ల సాల్వెన్సీతోపాటు టెండరు ఖరారైన వెంటనే కోటి రూపాయలు ఈఎండీ చెల్లించాలి.
పక్కా స్కెచ్
బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.170 నుంచి 200 వరకు ఉంది. వచ్చే క్రిస్మస్, సంక్రాంతి పండగలను దృష్టిలో పెట్టుకుని, తొలుత ఆరు నెలలపాటు రేషన్ కార్డులున్న పేదలకు కిలో రూ. 100కే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రేషన్ కార్డులున్న దాదాపు కోటిన్నర కుటుంబాలకు నెలకు కిలో చొప్పున కందిపప్పు సరఫరా చేయాలంటే నెలకు 14,750 టన్నుల చొప్పున, ఆరు నెలలకు మొత్తం 88,500 టన్నుల పప్పు అవసరమవుతుందని అంచనా వేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రానికి 1.20 లక్షల టన్నుల ముడి కందులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ నాఫెడ్ నుంచి 40,300 టన్నుల ముడి కందులనే రాష్ట్రానికి కేటాయిస్తూ అక్టోబరు 26న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆరు నెలలు కాస్తా మూడు నెలలకు కుదించారు. ముడి కందులను పప్పుగా మార్చేందుకు అవసరమైన మిల్లులు, ప్రాసెసింగ్ కేంద్రాలను టెండరు ప్రక్రియ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం అదే రోజు ఎన్సీసీఎఫ్ విశాఖపట్నం బ్రాంచి అధికారులు టెండరు నోటీసు జారీ చేశారు. 28వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు టెండరు తెరవనున్నట్లు పేర్కొన్నారు.
అంటే టెండరు దారులకు 48 గంటల సమయం కూడా ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ లేని ఇలాంటి నిబంధనలతో ఎన్సీసీఎఫ్ టెండరు నోటీసులు జారీ చేయడంతో ఆ ప్రక్రియే వివాదంలో పడిపోయింది. ఎన్సీసీఎఫ్లో ఎంప్యానల్ అయిన ఒక బడా వ్యాపారి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో తనకున్న పలుకుబడిని ఉపయోగించి చక్రం తిప్పారని బాధిత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ. 750 కోట్ల విలువైన కందిపప్పు టెండరును ఆ వ్యాపారికే కట్టబెట్టేందుకు ఎన్సీసీఎఫ్ అడ్డగోలు నిబంధనలను తెరమీదకు తెచ్చారని విమర్శిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు