Share News

హైదరాబాద్‌కు బిల్ గేట్స్‌ను నేనే రప్పించా.. ఆనాడే ఐటీపై ఫోకస్ పెట్టా: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:56 PM

సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజున సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మ చేపట్టిన ఫైర్ సైడ్ చాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలను సీఎం వివరించారు.

హైదరాబాద్‌కు బిల్ గేట్స్‌ను నేనే రప్పించా.. ఆనాడే ఐటీపై ఫోకస్ పెట్టా: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి/విశాఖపట్టణం, నవంబర్ 13: సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజున సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మ చేపట్టిన ఫైర్ సైడ్ చాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలను సీఎం వివరించారు. భవిష్యత్ ఐటీకి ఉంటుందని ఆనాడే అంచనా వేసి ఆ రంగానికి ప్రాధాన్యం ఇచ్చానని తెలిపారు. హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించేలా మైక్రో సాఫ్ట్ సంస్థ స్థాపకులు బిల్ గేట్స్‌ను తాను ఒప్పించిన విధానాన్ని చెప్పుకొచ్చారు.


దేశంలోనే తొలిసారి విద్యుత్ సంస్కరణలను తెచ్చా..

భారత దేశంలో మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులు ఉంటారని... ఇది ఐటీ రంగానికి ఉపయోగపడుతుందని నాడు బిల్ గేట్స్‌కు వివరించానని సీఎం తెలిపారు. ఐటీ రంగానికి అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంజినీరింగ్ కాలేజీలకు ఎక్కువగా అనుమతులిచ్చామని చెప్పారు. ఐటీకి తాను ప్రాధాన్యమిస్తుంటే నాటి ప్రతిపక్షాలు విమర్శలు చేసేవని గుర్తుచేశారు. ఐటీ సంస్కరణలే కాకుండా.. దేశంలోనే తొలిసారి విద్యుత్ సంస్కరణలను కూడా తెచ్చినట్లు చెప్పారు.


ఏఐ, డెమోగ్రాఫిక్ డివిడెంట్‌‌పై ప్రస్తావన

సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏఐ, డెమోగ్రాఫిక్ డివిడెండ్ వంటి అంశాలను ఫైర్ సైడ్ చాట్‌లో సీఎం ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వల్ల కలిగే లాభాలను వివరించారు. వివిధ దేశాల్లో భవిష్యత్తులో యువకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని నివేదికలు వస్తున్నాయని అన్నారు. భారత దేశానికి యువత అత్యంత బలమైన మానవ వనరులని... జనాభానే దేశానికి సంపదని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఏఐ, క్వాంటం వంటి రంగాలతో పాటు... సేవల రంగంలో ముఖ్యంగా టూరిజం రంగంలో ఎక్కువ ఉపాధి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోందన్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా రూపాంతరం చెందడానికి చాలా కాలం పట్టిందని గుర్తు చేశారు.


పేదలను ఆదుకోండి.. చేయూతనివ్వండి

అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం... భవిష్యత్ రంగాలను అంచనా వేసుకుని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని యువతకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. పీ3 విధానంలో మౌళిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని... ఇదే సమయంలో కొందరు అద్భుతమైన ప్రగతి సాధించారని చెప్పారు. పేదలకు-ధనవంతులకు మధ్యనున్న అంతరాలను తగ్గించేందుకు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి కార్పోరేట్ యాజమాన్యంలోనూ పేదలను ఆదుకోవాలని.. వారికి చేయూతనివ్వాలనే ఆలోచన కలగాలన్నారు. కార్పోరేట్ సంస్థలు పేదలకు చేయూతనివ్వకుంటే.. అంతరాలు పెరిగితే పేద, మధ్య తరగతి ప్రజల్లో నిరాశా నిస్పృహలు పెరుగుతాయని.. ఇవి అంతిమంగా ఆందోళనలకు దారి తీస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ తరహా వాతావరణం చూస్తున్నామని తెలిపారు.


ప్రతి కుటుంబానికి భరోసా, భద్రత..

పేదలను ఆదుకునేందుకు ధనవంతులు... కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి భరోసా, భద్రత కలిగించేలా పని చేస్తున్నామని వివరించారు. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇలా చేస్తున్నాం కాబట్టే... ఓపీ జిందాల్ యూనివర్శిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో ఏపీ 13వ స్థానంలో ఉందని.. జీవన ప్రమాణాల విషయంలో రెండో స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఐటీ శకం ముగిసింది.. ఏఐ, క్వాంటం శకం మొదలైంది: సీఎం చంద్రబాబు

P4కు కార్పొరేట్ చేయూత.. 25 వేల కుటుంబాలను దత్తత తీసుకున్న ఐటీసీ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 01:13 PM