ఐటీ శకం ముగుస్తోంది.. ఏఐ, క్వాంటం శకం మొదలైంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:24 AM
పెట్టుబడులు లేకపోతే సంపద సృష్టి జరగదని.. అందుకే తాను పీపీపీ, P4 మోడల్‌ను నమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
విశాఖపట్నం, నవంబర్ 13: పెట్టుబడులు లేకపోతే సంపద సృష్టి జరగదని.. అందుకే తాను పీపీపీ(PPP), P4 మోడల్‌ను నమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రెండో రోజు సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ మొదలైంది. ఈ సందర్భంగా సీఎం సమక్షంలో వివిధ కంపెనీలు 12 ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. AP CRDA, ఏపీ మారిటైమ్ బోర్డ్, ఐటీ ఎలక్ట్రానిక్స్, P4కు సంబంధించి వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆయా సంస్థలకు ప్రాజెక్టుల జీవోలను ముఖ్యమంత్రి అందజేశారు. ఒప్పందాలు చేసుకోవటంతో పాటు ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై దృష్టి పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం సూచనలు చేశారు. ప్రాజెక్టులు గ్రౌండ్ చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు.
తలసరి ఆదాయంలో ఏపీ 13వ స్థానం
ఐటీ శకం ముగుస్తోందని.. ఏఐ, క్వాంటం శకం మొదలైందని సీఎం తెలిపారు. సమర్థ, సుస్థిర నాయకత్వం ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నూతన సాంకేతికతలకు అనుగుణంగా సంస్కరణలు వస్తున్నాయని వివరించారు. తలసరి ఆదాయంలో ఏపీ 13వ స్థానంలో ఉందన్నారు. ‘నా పాలసీల వల్లే స్థానిక ఎన్నికల్లో మా ఓట్ షేర్ పెరిగింది’ అని చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి చేస్తే.. వాళ్లే ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు.
వారికి ధన్యవాదాలు
బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ స్కాలర్షిప్ను 1120 మంది విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ముందుకు రావటం సంతోషదాయకమని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఐటీసీ కూడా సామాజిక బాధ్యతగా పీ4కు సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 25 వేల మంది బంగారు కుటుంబాలకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రధాని మోదీలాంటి వ్యక్తులు కూడా అత్యంత పేదకుటుంబంలో నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగారని చెప్పుకొచ్చారు. స్పేస్ సెక్టార్ కోసం తిరుపతి వద్ద 5 వేల ఎకరాలను సిద్ధంగా ఉంచామని.. స్పేస్ డిఫెన్స్ రంగంలోని పరిశ్రమలకు ఈ ప్రాంతం అనుకూలమన్నారు.
రాజకీయ నేతగా దానిపై దృష్టిపెట్టా
ఆధునిక సాంకేతిక పరికరాలు రోజురోజుకూ జీవితాన్ని మార్చేస్తున్నాయని... దానికి అనుగుణంగా ఆలోచనలూ మారాల్సి ఉందని సీఎం వెల్లడించారు. సెమికండక్టర్లు, ఏఐ, క్వాంటం, ఏరోస్పేస్ ఇలా వేర్వేరు రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆస్కారం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల లాంటి విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఏపీని ప్రయోగశాలగా మార్చుకుని పరిశోధనలు చేయాలని, నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. పెట్టుబడులు వస్తేనే సంపద సృష్టించగలమని.. రాజకీయ నేతగా దీనిపై దృష్టిపెట్టినట్లు తెలిపారు.
పీ4 ఉద్యమంలో పాల్గొనండి..
సంపద సృష్టితో పాటు పేదల జీవన ప్రమాణాలు కూడా పెంచాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. విద్య, వైద్యం, ఆర్థిక, సామాజిక స్థితులను మెరుగుపరచాలని చెప్పుకొచ్చారు. అందుకే పీ4 కార్యక్రమం తీసుకువచ్చి వారి జీవన ప్రమాణాలను మార్చేందుకు చేయూత అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఒపీ జిందాల్ యూనివర్సిటీ యాక్సెస్ టూ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉందని తేల్చి చెప్పిందన్నారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక సామాజిక భద్రతను ప్రజలకు అందించటంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. పీ4 ఉద్యమంలో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
అదే నా నిరంతర తాపత్రయం
టీవీఎస్ కంపెనీ కుప్పంలో ఇటీవల ఓ ఇటుక తయారీ కార్మికురాలికి చేయూత అందించి ఆమెను ఇటుకబట్టీ యజమానిగా మార్చిందని సీఎం అన్నారు. ఇప్పుడు ఆ పేద మహిళ మరో 20 మందికి జీవనోపాధి అందించే వ్యాపారవేత్తగా మారిందని.. ఇలాంటి విజయగాథలే అంతటా వినిపించాలని ఆకాంక్షించారు. అవసరం ఉన్న వ్యక్తులకు సంపద అందింతేనే ఆ సంపదకు విలువ ఉంటుందన్నది అంతా గుర్తించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ కుటుంబం హ్యాపీ, హెల్తీ, వెల్తీగా ఉండాలన్నదే నిరంతర తాపత్రయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
పదేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?.. కేటీఆర్‌పై పొన్నం ఫైర్
రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ఫైర్.. రూ.100 కోట్ల ఖర్చుపై ప్రశ్నలు
Read Latest AP News And Telugu News