సరాక ఫ్యాక్టరీ ప్రమాదం.. కార్మికుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
ABN , Publish Date - Oct 23 , 2026 | 10:36 AM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ కారణంగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుదర్శన్, బాలాజీ అనే ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. ఈ ప్రమాదంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
సంగారెడ్డి జిల్లా, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ కారణంగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుదర్శన్, బాలాజీ అనే ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. ఈ ప్రమాదంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందడం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
కార్మికుల ప్రాణాలతో చెలగాటం..
నాడు సిగాచి.. నేడు సరాక పరిశ్రమలో ప్రమాదాలు జరిగాయని హరీశ్‌రావు వెల్లడించారు. గత చేదు అనుభవాల నుంచి ఈ ప్రభుత్వం ఏం నేర్చుకోదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటోందని ధ్వజమెత్తారు.పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు ప్రశ్నార్థకంగా మారగా, అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప.. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్నదేమిటి? అని నిలదీశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేదెప్పుడు? అని ప్రశ్నించారు.
భద్రతా చర్యలు పటిష్ఠం చేయాలి..
సరాక పరిశ్రమ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి బాధ్యులైన కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్ఠం చేయాలని పట్టుబట్టారు. ఉపాధి కోసం వచ్చిన అమాయక కార్మికుల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. సిగాచి ఘటనలో ఇంటి పెద్దను కోల్పోయిన 54 మంది కార్మిక కుటుంబాలందరికీ సీఎం స్వయంగా ప్రకటించిన రూ.కోటి పరిహారాన్ని ఇప్పటికైనా అందించి మాట నిలుపుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మా ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత నాది: సీఎం రేవంత్‌రెడ్డి
టీడీఆర్ సేవలకు ఆధార్‌తో గుర్తింపు నిర్ధారణకు ప్రభుత్వం అనుమతి
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News