మా ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత నాది: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Oct 22 , 2026 | 03:27 PM
తమ ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత తనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజులేనని.. వారు విశ్వాసనీయమైన వారని కొనియాడారు.
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత తనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజులేనని.. వారు విశ్వాసనీయమైన వారని కొనియాడారు. భూస్వాములు పేదల భూములను ఆక్రమిస్తే పండుగ సాయన్న ఎదురుతిరిగారని చెప్పారు. పండుగ సాయన్నను అన్యాయంగా హత్య చేశారని.. ఆయన చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ నాట్లు, కోతల సమయంలో పండుగ సాయన్న పాటలు వినిపిస్తున్నాయని తెలిపారు.
పండుగ సాయన్న పేదలకు అండగా నిలిచారు..
నాడు ఎన్టీఆర్ హయాంలో రూ.2లకు కిలో బియ్యం ఇస్తే.. తాము ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 3.48 కోట్ల మందికి నేడు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్‌లో పండుగ సాయన్న జయంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని, మాట్లాడారు. నిజాం హయాంలో దొరలు.. పేదల భూములను ఆక్రమిస్తుంటే వారికి అండగా పండుగ సాయన్న నిలిచారని ప్రశంసించారు. దొరలకు వ్యతిరేకంగా తాను ఓ దళాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. సాయన్న ప్రజలకు ధాన్యం పంచడమే కాదని, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేశారని కొనియాడారు. ఆయనను నిజాం పోలీసులు అరెస్టు చేస్తే నాటి వనపర్తి మహారాణి పెద్దఎత్తున నిధులు చెల్లించి విడిపించారని తెలిపారు.
మా ప్రభుత్వం కులగణన చేపట్టింది..
బ్రిటిష్ హయాంలో కులగణన చేశారని.. వందేళ్ల తర్వాత తమ ప్రభుత్వం కులగణన చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. కులగణన చేసినందుకనే ఈ రోజు బలంగా ప్రతి కులం.. తమ గళం వినిపిస్తోందని అన్నారు. ఎవరైనా కులగణనలో తమ జనాభా తక్కువగా ఉందని భావిస్తే పూర్తి వివరాలిస్తే లెక్కలను సవరిస్తామని చెప్పారు. లెక్కలు లేనందునే ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చలేకపోయారని అన్నారు. ఈ అంశంపై వచ్చే క్యాబినెట్ భేటీలో చర్చిస్తామని మాటిచ్చారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, పూర్తిస్థాయిలో అధ్యయనం చేయిస్తామని వెల్లడించారు. ఈ అంశంపై ఇతర కులాలకు ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉందని తెలిపారు.
జఠిలమైన ఎస్సీ వర్గీకరణను అమలు చేశాం..
జఠిలమైన ఎస్సీ వర్గీకరణను అమలు చేశామని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బీసీ కులగణన చేపట్టామని అన్నారు. తాను గతంలో టీపీసీసీ అధ్యక్షుడిని కాగానే శ్రీహరి ముదిరాజ్‌ను డీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించానని తెలిపారు. శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చానని.. మంత్రిని చేశానని వ్యాఖ్యానించారు. నీలం మధుకు ఎంపీ టికెట్ ఇచ్చానని తెలిపారు. ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు.
ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం..
గత ప్రభుత్వాలు చేసిన సంక్షేమానికి.. తమ పాలనలో రెట్టింపు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించామని తెలిపారు. గత పాలకులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల చరిత్రను కనుమరుగు చేశారని అన్నారు. ట్యాంక్ బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ఆవిష్కరిస్తామని తెలిపారు. పండుగ సాయన్న, గద్దర్, అందెశ్రీ వంటి వారు జీవితమంతా సమాజం కోసమే జీవించారని కొనియాడారు. బహుజనుల జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమని.. ఆ ఎన్నికల్లో రాహుల్‌కి అండగా ముదిరాజ్‌లు నిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక
Read Latest AP News And Telugu News