Share News

కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:23 PM

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఈ రెండు పార్టీలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు.

కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు
BJP MP Raghunandan Rao

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఈ రెండు పార్టీలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. ‘అసెంబ్లీలో నీవు కొట్టినట్లు చెయ్యి.. నేను ఏడ్చినట్లుగా చేస్తా అన్నట్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు డ్రామాలు చేశారు’ అని ఎద్దేవా చేశారు. వీరి డ్రామాలు ఒకేరకంగా ఉన్నాయని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు తెలంగాణ అభివృద్ధి పట్టదని ఆగ్రహించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్‌లకు వెళ్లడం అవసరమా.? అని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం తప్ప ఏమి లేదని అన్నారు. ఈరోజు (ఆదివారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో రఘునందన్ రావు మాట్లాడారు.


దానం నాగేందర్‌కు బై ఎలక్షన్ అచ్చివచ్చినట్లుగా ఎక్కడ లేదు..

భూముల రికార్డులన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా.. మళ్లీ వెళ్లి చూడటం ఎందుకని రఘునందన్ రావు నిలదీశారు. దానం నాగేందర్‌కు బై ఎలక్షన్ అచ్చివచ్చినట్లుగా ఎక్కడ లేదని చెప్పారు. ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని.. ఒకే తాను ముక్కలని విమర్శించారు. ప్రజలను పీడించిన నిజాం తరహాలోనే కేసీఆర్, రేవంత్‌రెడ్డి పాలన ఉందని ఆగ్రహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో నిజాంను పొగిడిన కేసీఆర్, రేవంత్ వీడియోలను రఘునందన్ రావు ప్రదర్శించారు. కేసీఆర్ లెక్కాపత్రం లేకుండా నిజాంను పొగిడారని మండిపడ్డారు. ఆదివాసీ బిడ్డలను ఇబ్బంది పెట్టింది ఎవరు.? అని ప్రశ్నించారు. రేవంత్, కేసీఆర్ ఇద్దరు ఎంఐఎంకు మద్దతుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఓల్డ్‌సిటీకి వెళ్లి ఇద్దరు మజ్లిస్‌ను పొగుడుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. నిజాం సర్కార్ కొలువుల్లో 90 శాతం ముస్లింలే ఉండేవారని తెలిపారు. మహిళలతో దారుణంగా బతుకమ్మలు ఆడించిన నిజాం గొప్పవారని కేసీఆర్, రేవంత్ పొగుడుతున్నారా.? అని ప్రశ్నించారు.


బైరాన్‌పల్లి ఘటనకు కారణమైన నిజాం ఎలా గొప్పవారు.?..

బైరాన్‌పల్లి ఘటనకు కారణమైన నిజాం ఎలా గొప్పవారు.? అని రఘునందన్ రావు నిలదీశారు. శాసనసభలో నిజాంను పొగడటానికి ఆ ఇద్దరికి సిగ్గు లేదా.? అని ఎద్దేవా చేశారు. నిజాం గొప్పవారైతే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేసిన ఆపరేషన్ పోలో తప్పా.? అని ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరు నయా నిజాంలు అని వ్యగ్యంగా మాట్లాడారు. నయా నిజాంలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దాశరథి చెప్పిన నిజాం రాజు తరతరాల బూజు అన్నది తప్పా.? అని నిలదీశారు. కొమురం భీమ్, రాంజీ గోండు చేసిన ఉద్యమాలు తప్పా.? అని ప్రశ్నించారు. నిజాం మీద బాంబులు వేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ.. నారాయణ రావు పవార్ పోరాటం తప్పా.? అని అడిగారు. రామానంద తీర్థ, ఆర్య సమాజ్ చేసిన పోరాటాలు అర్ధం లేనివా.? అని ప్రశ్నించారు. నేడు కేసీఆర్ వెంట, నేడు కాంగ్రెస్ వెంట నడిచిన తోకపార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని ఎద్దేవా చేశారు. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్

రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 01:06 PM