కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:56 PM
మాజీ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏబీఎన్‌తో మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు (శనివారం) మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సెండాఫ్ చెప్పడానికి ఢిల్లీకి తాము వచ్చామని తెలిపారు. కేసీఆర్ కుటుంబ భూముల వ్యవహారంపై అధికారుల విచారణ కొనసాగుతోందని చెప్పారు.
ఆ భూములు కేసీఆర్ కుటంబానికి ఎలా వచ్చాయి..
ఇన్ని వందల ఎకరాల భూములు కేసీఆర్ కుటంబానికి ఎలా వచ్చాయని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆ భూములు వారివి అయితే పేపర్లు చూపించాలని సవాల్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు, దళితులకు సొంతింటి కల నెరవేర్చడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. 22ఏ పాపం కాంగ్రెస్ పార్టీది కాదని తెలిపారు. 22ఏ పై కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నేతలు విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం విచారణపై సీబీఐకి లేఖ రాశామని, విచారణ ఎందుకు చేయడం లేదో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు చెప్పాలని సవాల్ చేశారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ డీసీసీలు, కార్పొరేషన్, పదవులు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.
మహాగణపతికి మహేశ్ గౌడ్ ప్రత్యేక పూజలు..
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మహాగణపతి పూజ కార్యక్రమంలో మహేశ్ గౌడ్ పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక పూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవాలని, పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉండాలని భగవంతుడిని ప్రార్థించానని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌కి కనువిప్పు..
కేసీఆర్ చేసిన దారుణాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌కి కనువిప్పు. దానం నాగేందర్ తీర్పు మాకు చెంపపెట్టు అంటున్నారని, కానీ బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఇది చెంపపెట్టు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డిని గులాబీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు.హై కోర్టు తీర్పు ఇచ్చింది.. అదే మా వాళ్లు బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు జడ్జిమెంట్ ఉండి ఉంటే వేరే విధంగా ఉండేది. తప్పుడు సంస్కృతిని తీసుకొచ్చింది బీఆర్‌ఎస్. మా ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పారు. హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు. తలసాని, సబిత ఇంద్రారెడ్డి మంత్రులను చేశారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వేరే పార్టీల నేతలను చేర్చుకున్నారు. మా గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు. ప్రజాస్వామ్యాన్ని మోదీ, అమిత్ షా సర్వనాశనం చేశారు. మోదీ, అమిత్ షా దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారు. ఈ పరిస్థితుల ప్రభావంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇచ్చారు. 2014లో జరిగిన పార్టీ ఫిరాయింపు, 2023లో జరిగిన ఫిర్యాంపులకు వ్యత్యాసం ఉంది. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉన్నాం. దానం నాగేందర్ విషయంలో మా హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. కడియం శ్రీహరిపై పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జన్వాడ ఫాంహౌస్‌పై బీఆర్ఎస్ నేతలు నీతులు చెబుతున్నారు. ఫాంహౌస్ సంస్కృతి తెచ్చిందే బీఆర్‌ఎస్. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎర్రవెల్లి ఫాంహౌస్ ఎన్ని ఎకరాలు అనేది ప్రజలకు తెలియాలి. మాజీ మంత్రి కేటీఆర్ మూడు రకాల స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. కేసీఆర్ ఫాంహౌస్ లాక్కునే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు. నా ఆస్తులు అన్ని బహిర్గతంగా ఉన్నాయి. నా ఆస్తులు పెరిగాయో లేదో తెలుసుకోవాలి’ అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సొంత ఆస్తులు తెలియజేయాలి..
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సొంత ఆస్తులు తెలియజేయాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ‘తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరు వచ్చిన కలిసి పని చేయాల్సిందే. దానం నాగేందర్ టికెట్‌ను ఏఐసీసీ నిర్ణయిస్తుంది.జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సానుభూతి ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. రేపు ఉపఎన్నిక వస్తే గెలిచేది కాంగ్రెస్ అభ్యర్థినే. టికెట్ ఎవరికి ఇచ్చిన ఖైరతాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ప్రజలు సంక్షేమ పథకాలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, సీఎం సభకు రాజగోపాల్ రెడ్డి రావడం మంచి పరిమాణం. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కొండా సురేఖ, చిన్నారెడ్డితో మాట్లాడాను... వారు మా పార్టీలో కొనసాగుతారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు అభ్యర్థుల నివేదిక రాబోతుంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ఆశపడుతున్నారు. బీజేపీ మతత్వ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. బీజేపీ మాటలకు, చేతలకు పొంతన లేదు. గ్రౌండ్‌లో బీఆర్ఎస్ లేదు... బీజేపీ తెలంగాణలో మొలకెత్తదు’ అని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు.