Share News

పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:01 PM

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కాదు ఆయన బాంబులేటి.. పొగరులేటి అని ఎద్దేవా చేశారు.

పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
HarishRao

వనపర్తి జిల్లా, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై (Minister Ponguleti Srinivas Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (HarishRao) సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కాదు ఆయన బాంబులేటి.. పొగరులేటి అని ఎద్దేవా చేశారు. పవిత్రమైన అంబేద్కర్ సచివాలయంలో పొగరులేటి మాటలు.. నిజాలు దాచి అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహించారు. ఆయన మాటలు వింటే.. ఆయన ఎంత డిఫెన్స్‌లో ఉన్నారో అర్ధమవుతోందని అన్నారు. ఆయనలో సరుకు లేనందునే తిట్ల దండకం అందుకున్నారని ధ్వజమెత్తారు. పిట్ట కథలు.. తిట్లు.. ఆయన ఆయాసం.. అన్నీ చూశామని విమర్శించారు. ఆయనతో పాటు సహచర మంత్రుల అవినీతి చిట్టా కూడా చదివారని ఎద్దేవా చేశారు. ఈరోజు(గురువారం) వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో హరీశ్‌రావు పర్యటించారు. గొల్లపల్లి రిజర్వాయర్ వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు.


అవినీతి బాగోతాన్ని బయట పెట్టారు..

మంత్రులు జూపల్లి కృష్ణారావు, మల్లు భట్టి విక్రమార్క, సీఎం సోదరుల అవినీతి బాగోతాన్ని పొంగులేటినే బయట పెట్టారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆయన పొంగులేటి కాదు పొంగులూటీ అని వ్యగ్యంగా మాట్లాడారు. ఆయన క్రషర్‌లో జరిగిన అవినీతిని సీఎం రేవంత్‌రెడ్డినే స్వయంగా బయటపెట్టారని ఆరోపించారు. ప్రతిపక్షం కాదని.. తామే అన్ని విషయాలు వెలుగులోకి తెస్తామని అసెంబ్లీలోనే సీఎం చెప్పారని అన్నారు. సీఎం ఆదేశాలతో అన్ని శాఖల అధికారులు వెళ్లి.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు అనుమతులు లేవని నివేదిక ఇచ్చారని ప్రస్తావించారు. మరి అధికారులు, సీఎం చెప్పింది తప్పా.. పొంగులేటి చెప్పింది తప్పా అని ప్రశ్నించారు.. ఇదంతా మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నమని ఆరోపించారు. తాము ఈ విషయాన్ని లేవనెత్తిన తర్వాతనే రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన కంటైనర్‌పై రంగు వేసి, కాంగ్రెస్ జెండా తీసేశారని ఆరోపించారు.


నాదర్‌గుల్ భూములను రక్షించాం..

కేసీఆర్ హయాంలో నాదర్‌గుల్ భూములను 22 ఏ లో పెట్టి రక్షించామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ భూములను ఎందుకు దాస్తున్నారని.. వీటి గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇవి ప్రభుత్వ భూములని ఆర్డీఓ కోర్టులో చెప్పారని.. మరి ఎందుకు అక్కడి భూమిలో రోజుకోక కొత్త బోర్డు వెలుస్తోందని నిలదీశారు. ఇవి ప్రభుత్వ భూములు అయితే ఆక్రమణ దారులపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడిగారు. రెవెన్యూ మంత్రిగా పొంగులేటి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన ఇదివరకు బాంబులు పడతాయని చెప్పి ఏడాది దాటిందని.. అవి తుస్సుమన్నాయని సెటైర్లు గుప్పించారు. హైడ్రా పంపించి, కాంపౌండ్ వాల్ కూలగొట్టి, ఆక్రమణలను కూల్చి రేవంత్‌రెడ్డి సర్కార్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాళేశ్వరంపై విచారణ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 03:21 PM