Share News

కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారు: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Jan 31 , 2026 | 02:30 PM

కేసీఆర్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారు: మంత్రి పొంగులేటి
Telangana Minister Ponguleti Srinivas Reddy

ఖమ్మం జిల్లా, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. వారి అకౌంట్‌లు నింపుకోవాలని చూశారే తప్ప.. పేదల సంక్షేమానికి కృషి చేయలేదని ధ్వజమెత్తారు. రెండుసార్లు మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వారి స్వలాభం కోసం కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ సాయి ప్రభాత్ నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


పేదలందరికీ ఇళ్లు..

తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో 32 డివిజన్లను మొత్తం తామే కైవసం చేసుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజల దీవెనలతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కోసం పని చేస్తున్నామని వివరించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.22,500 కోట్లతో ఇళ్లు ఇచ్చామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇస్తామని భరోసా కల్పించారు.


అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..

ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవారి కష్టం తెలిసిన పెద్ద కొడుకుగా ఇక్కడి వారికి అన్ని సౌకర్యాలూ కల్పిస్తానని చెప్పుకొచ్చారు. గడిచిన రెండేళ్లలో ఏదులాపురం 5, 6 డివిజన్లలో రూ.19 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తామన్నారు. ఎఫ్‌సీఐ గోడౌన్‌ను ఇక్కడ నుంచి తరలిస్తామని మంత్రి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 03:00 PM