ఇందిరమ్మ ఇళ్లపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:10 PM
దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ పార్టీ కాంగ్రెస్‌లో మనమంతా పని చేయటం అదృష్టమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం తెచ్చిందని ఉద్ఘాటించారు.
ఖమ్మం జిల్లా, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ కాంగ్రెస్‌లో మనమంతా పని చేయటం అదృష్టమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ఈ దేశానికి కాంగ్రెస్ స్వాతంత్య్రం తెచ్చిందని ఉద్ఘాటించారు. దేశంలో ఏ పార్టీకి ఇంతటి ఘన చరిత్ర లేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీ బాధ్యతల స్వీకార కార్యక్రమం ఈరోజు (మంగళవారం) జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్ హాజరయ్యారు. అలాగే, అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని జడ్పీ సర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి భట్టి విక్రమార్క, మహేశ్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు.
ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి..
నేడు దేశాన్ని ఏలుతున్న బీజేపీ కూడా కాంగ్రెస్ తర్వాతే వచ్చిందని భట్టి విక్రమార్క ప్రస్తావించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తోంటే రైతులకు ఆ మేలు జరగకూడదని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రూ.22,500 కోట్లతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహించారు.పేదలకు ఇళ్లు దక్కకూడదనే లక్ష్యంతో ప్రతిపక్షాల నేతలు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేద్దాం..
కాంగ్రెస్ బలోపేతానికి అందరం ఐక్యంగా కృషిచేద్దామని భట్టి విక్రమార్క సూచించారు. మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. కాంగ్రెస్‌పై ప్రతిపక్షాల నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీని కాపాడుకునేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడారని ప్రశంసించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేద్దామని సూచించారు. పార్టీకోసం కష్టపడిన వాళ్లకి తప్పకుండా గుర్తింపు దక్కుతుందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీలిమిటేషన్‌తో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి
లవ్ జిహాద్ కేసుపై బండి సంజయ్ ఘాటు స్పందన
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. అడ్వకేట్‌కు డ్రంకెన్ టెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News