Share News

అక్టోబరులోనే రూ.7738 కోట్లు!

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:48 AM

దసరా, దీపావళి పండగల సీజన్‌ తెలంగాణ రాష్ట్ర ఖజానాను కళకళలాడించింది. పండగల వేళ షాపింగ్‌, ఇతర కొనుగోళ్లతో వాణిజ్య పన్నుల శాఖకు కాసుల వర్షం కురిసింది.

అక్టోబరులోనే రూ.7738 కోట్లు!
Telangana Tax Revenue

  • కళకళలాడిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఖజానా

  • 7 నెలల్లో రూ.52,113 కోట్ల రాబడి

  • దసరా, దీపావళితో పెరిగిన జీఎస్టీ, వ్యాట్‌ వసూళ్లు

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): దసరా, దీపావళి పండగల సీజన్‌ తెలంగాణ రాష్ట్ర ఖజానాను కళకళలాడించింది. పండగల వేళ షాపింగ్‌, ఇతర కొనుగోళ్లతో వాణిజ్య పన్నుల శాఖకు కాసుల వర్షం కురిసింది. అక్టోబరులో రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు నమోదయ్యాయి. వృత్తి పన్ను కూడా కలుపుకొని ఒక్క అక్టోబరులోనే వాణిజ్య పన్నుల శాఖకు రూ.7,738 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.6,332 కోట్లతో పోలిస్తే.. రూ.1,406 కోట్ల (22శాతం వృద్ధి) అదనపు రాబడి వచ్చింది. దసరా, దీపావళి పండగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాలు, గృహోపకరణాలు, ఆభరణాలు, దుస్తుల కొనుగోళ్లతో పాటు హోటళ్లు, పర్యాటక రంగాలు కూడా బిజీగా మారాయి. దీంతో అక్టోబరులో జీఎస్టీ రాబడి రూ,4,593 కోట్లకు చేరింది. జాతీయ స్థాయిలోనూ అక్టోబరులో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లకు పైగా రావడంతో 22.9 శాతం వృద్ధి నమోదైంది.


31 శాతం పెరిగిన వ్యాట్‌ రాబడి!

పండగ ప్రయాణాల ధాటికి ఇంధన వినియోగం పెరగడం, వేడుకల నేపథ్యంలో మద్యం విక్రయాలూ పెరగడంతో వ్యాట్‌ రూపంలో వాణిజ్య పన్నుల శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. పెట్రోల్‌, డీజిల్‌, మద్యం విక్రయాలపై వచ్చే వ్యాట్‌ ఆదాయం గత ఏడాది అక్టోబరులో రూ.2,342 కోట్లు ఉండగా.. ఈ సారి ఏకంగా 31 శాతం వృద్ధితో రూ.3,065 కోట్లకు పెరిగింది. ఒక్క నెలలోనే వ్యాట్‌ ద్వారా రూ.723 కోట్ల అదనపు రాబడి సమకూరడం విశేషం. ఉద్యోగులు, వ్యాపారుల వృత్తి పన్ను మాత్రం స్వల్ప వృద్ధితో సరిపెట్టుకుంది. గత అక్టోబరులో రూ.76 కోట్లుగా ఉన్న రాబడి.. ఈ సారి రూ.80 కోట్లకు చేరింది. అంటే 5 శాతం వృద్ధితో రూ.4 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 నెలల (ఏప్రిల్‌ నుంచి అక్టోబరు)కు సంబంధించిన వాణిజ్య పన్నుల వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడు నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ మొత్తం రూ.52,113 కోట్ల స్థూల రాబడిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.44,598 కోట్లతో పోలిస్తే.. 17 శాతం వృద్ధితో రూ.7,515 కోట్ల అదనపు ఆదాయం లభించింది. రాష్ట్రంలో జీఎస్టీ, వ్యాట్‌ వసూళ్లు రెండూ పెరుగుతుండడం వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు సంకేతమని అధికారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ సమీపిస్తుండడంతో రాబోయే నెలల్లో కూడా పన్ను వసూళ్ల ఊపు ఇలాగే కొనసాగుతుందని, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటామని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


దేశవ్యాప్తంగానూ జోష్‌..!

దేశవ్యాప్తంగా కూడా అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక గణాంకాల ప్రకారం.. దేశ స్థూల జీఎస్టీ వసూళ్లు గత అక్టోబరుతో పోలిస్తే ఈ సారి 23 శాతం పెరిగి రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 15.8 శాతం పెరగ్గా.. దిగుమతులపై వచ్చిన ఆదాయం 42.2 శాతం వృద్ధి చెందింది. దేశీ య వినియోగం, దిగుమతులు రెండూ పన్నుల వసూళ్ల పెరుగుదలకు దోహదం చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

వడివడిగా ఎడ్యుకేషన్‌ హబ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. హరీశ్‌రావుపై కొత్త ఎఫ్‌ఐఆర్‌

అన్నదాత చెప్పిందే ధర!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 04:48 AM