వడివడిగా ఎడ్యుకేషన్ హబ్
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:34 AM
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
మార్చినాటికి పూర్తి చేయాలన్న సీఎం..
228 ఎకరాల్లో రూ.921 కోట్లతో పలు విద్యా సంస్థల నిర్మాణం
వాటిలో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ, ఇంజనీరింగ్, మహిళా డిగ్రీ కాలేజీలు
గడువులోగా పూర్తి చేయడం అధికారులకు సవాల్‌గా మారిన వైనం
దుద్యాల్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మూడు నెలల కిందటి వరకు మందకొడిగా సాగిన పనులు తర్వాత ఊపందుకున్నాయి. మొదటిసారిగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి అవి మందకొడిగా జరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రతినెలా పనుల పురోగతిని సీఎం స్వయంగా సమీక్షిస్తున్నారు. సీఎంవో కార్యదర్శి శ్రీధర్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి తదితరులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుండడంతో పనుల్లో వేగం పెరిగింది. కొడంగల్ నియోజకవర్గాన్ని విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఎడ్యుకేషన్ హబ్ నెలకొల్పాలని సీఎం నిర్ణయించారు.
గతంలో స్థానికంగా ఉన్నత చదువులు అందుబాటులో లేక కొడంగల్ ప్రాంత విద్యార్థులు మహబూబ్‌నగర్, వికారాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానికంగానే ఉన్నత చదువులు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం తో దుద్యాల్ మండలం హకీంపేట్, పోలేపల్లి గ్రామా ల శివార్లలో 228.54 ఎకరాల విస్తీర్ణంలో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒకే ప్రాంగణం లో వివిధ విద్యా సంస్థలు, వైద్య కళాశాలలు, క్రీడా సదుపాయాలతో కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. ఈ నెల 7 నుంచి మూడు రోజుల పాటు సీఎం కొడంగల్‌లోనే బస చేయనున్న నేపథ్యంలో నిర్మాణ పనులపై యంత్రాంగం దృష్టి సారించింది.
ఒకే ప్రాంగణంలో విద్య, వైద్య సంస్థలు
హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల, 430 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ, పశు వైద్య, ఇంజనీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ పాఠశాలల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. వీటితో పాటు ఏటీసీ కేంద్రం, క్రీడా మైదానాలు, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్ నిర్మించనున్నారు. ప్రస్తుతం భవనాల నిర్మాణ పనులు పిల్లర్లు, బీమ్‌లు, మొదటి, రెండో అంతస్తుల దశల్లో ఉండగా, కొన్ని భవనాల్లో ఇంటీరియర్ పను లు కొనసాగుతున్నాయి. కాగా, పశువైద్య కళాశాల పనుల్లో కొంత జాప్యం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో సైనిక్ పాఠశాల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
కాగా, ఈ నిర్మాణాలకు ప్రభుత్వం రూ.921.90 కోట్లు కేటాయించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ పాఠశాలకు రూ.200 కోట్లు, 430 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రూ.255 కోట్లు, మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ కళాశాలలకు రూ.197.50కోట్లు, పశువైద్య కళాశాలకు రూ.200కోట్లు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు రూ.15కోట్లు, ఏటీసీ రూ.42కోట్లు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు రూ.6.10కోట్లు, అతిథి గృహానికి రూ.5కోట్లు, ఫైర్ స్టేషన్‌కు రూ.1.30కోట్లు వెచ్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం మందకొడిగా సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2027 మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులకు లక్ష్యం నిర్దేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు కార్మికుల సంఖ్యను పెంచి పనులను వేగవంతం చేశారు. అయితే నిర్ణీత గడువులోగా ఏ మేరకు పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది అధికార యంత్రాంగానికి సవాల్ అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య
ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీశ్‌రావుపై కొత్త ఎఫ్‌ఐఆర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News