Share News

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Oct 29 , 2026 | 08:42 PM

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని.. పారిశ్రామికవేత్తలకు పూర్తి భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అడ్డంకులు తొలగిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని.. పారిశ్రామికవేత్తలకు పూర్తి భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అడ్డంకులు తొలగిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడాలని ఆకాంక్షించారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే తానే సంరక్షకుడిగా ఉంటానని భరోసా కల్పించారు. ఈరోజు (గురువారం) ఢిల్లీలో జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజారుద్దీన్, అధికారులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు.


ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలి..

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌’కు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సుమారు 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ఒక ప్రపంచస్థాయి నగరంగా వెలిగిందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాలకు వచ్చి వ్యాపారాలు చేసేవారని ప్రస్తావించారు. నిజాం పాలకులు అద్భుతమైన కట్టడాలు, ప్రపంచస్థాయి మ్యూజియం, టంక‌శాల (నాణేల ముద్రణాలయం), విమానాశ్రయం, రైల్వేలు, అత్యుత్తమ విద్యాసంస్థలతో హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశారని వెల్లడించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ ప్రపంచం గ‌ర్వించే మేథో నిపుణులు, నాయ‌కుల‌ను అందించిందని చెప్పుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ప్రేమ్ వత్స వంటి ప్రముఖులంతా హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారని ప్రస్తావించారు. విదేశీ పెట్టుబ‌డులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను తయారు చేయడంలో హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉందని వివరించారు.


అంచనాలను రెట్టింపు చేయండి..

‘1991 నుంచి హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, హైదరాబాద్ పెట్టుబడుల ప్రస్థానానికి అంతా మద్దతుగా నిలిచారు. వ్యాపార రంగం గురించి మాకంటే మీకే ఎక్కువగా అవగాహన ఉంది. మీ నుంచి నేర్చుకుంటాం, మీ అభిప్రాయాలను అర్థం చేసుకుంటాం, వాటిని ఆచరణలో పెడతాం. రాష్ట్రంలో మీరు పెట్టే పెట్టుబడులకు భద్రత కల్పించడం, అవి వృద్ధి చెందేలా చూడటం నా బాధ్యత. మీరు ఆశిస్తున్న వృద్ధి అంచనాలను రెట్టింపు చేయండి. మీకు ఏం కావాలో చెప్పండి. విధానపరమైన నిర్ణయాలైనా, ప్రభుత్వ సహకారమైనా, మీకు అవసరమైన మద్దతు అందించే బాధ్యతను నేను తీసుకుంటా. ‘తెలంగాణ రైజింగ్ 2047’ రాష్ట్ర భవిష్యత్ ప్రణాళిక. ఇది ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, అందులో రాష్ట్రం వాటా 10 శాతంగా ఉండాలి. ప్రస్తుతం దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 5 శాతంగా ఉంది. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


కేంద్రం తెలంగాణకు సహకరిస్తోంది..

‘పెట్టుబడిదారుల్లో చాలామందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ‌ధ్య సంబంధాలపై సందేహాలున్నాయి. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో మూడు హైదరాబాద్‌కు అనుసంధానం కానున్నాయి. హైదరాబాద్‌ - చెన్నై, హైదరాబాద్‌ - బెంగళూరు, హైదరాబాద్‌ - పుణె మార్గాల్లో ఈ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. వరంగల్‌, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం ద్వారా కూడా కేంద్రం తెలంగాణకు సహకరిస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మెట్రో రైలు విస్తరణ వరకు, నేవీ రాడార్ కేంద్రం నుంచి అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల వరకు సహకారం పొందుతున్నాం. అభివృద్ధి విష‌యంలో ప్రభుత్వ జోక్యం కంటే, అవసరమైన చోట ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి అవకాశాలను విస్తరించాలి. మీ విజయపథంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాం. హైదరాబాద్ ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో పోటీ ప‌డ‌దు. న్యూయార్క్‌, లండన్‌, టోక్యో, సియోల్‌, దుబాయ్‌ వంటి ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి. మా రాష్ట్ర అభివృద్ధికి మీ అత్యుత్తమ ఆలోచనలను అందించండి. మీ సూచనలను పరిశీలించి, వాటిని ప్రభుత్వ విధానాలుగా అమలు చేస్తాం. తెలంగాణ ఎదుగుతోందని.. ఈ ప్రగతి ప్రస్థానంలో మీరూ భాగస్వాములు కండి. మనమంతా కలిసి ఎదుగుతూ చరిత్ర సృష్టిద్దాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 10:24 PM