ఎల్‌నినో ముప్పుపై కార్యాచరణ
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:51 AM
ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశాల నేపథ్యంలో నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం ముందస్తు కార్యాచరణ చేపట్టింది. వచ్చే ఎనిమిది నెలలు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, ప్రత్యామ్నాయ పంటల సాగు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరాపై దృష్టి సారించింది.
-ఫామ్ పాండ్‌లు, ఇంకుడుగుంతల నిర్మాణానికి ప్రాధాన్యం
- ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సాహం
- జోరుగా ఉపాధి పనులకు ప్రణాళిక
జగిత్యాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశాల నేపథ్యంలో నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం ముందస్తు కార్యాచరణ చేపట్టింది. వచ్చే ఎనిమిది నెలలు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, ప్రత్యామ్నాయ పంటల సాగు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరాపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించగా కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేలా వివిధ శాఖలను సమన్వయం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 80.5 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆ నీటిని రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు.
ఫజిల్లాలో 9శాతం లోటు వర్షపాతం
జిల్లాలో ఇప్పటి వరకు 815.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 896.7 మిల్లీ మీటర్లు కాగా 9 శాతం లోటు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. భీమారం, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో లోటు నమోదైంది. జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, కొడిమ్యాల మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. జిల్లాలో 920చెరువులకు గాను 572 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు నిల్వ ఉంది. మరో ఆరు చెరువుల్లో వంద శాతం నీరు నిల్వ ఉన్నాయి. 148 చెరువులు 50శాతానికి తక్కువగా నీటి నిల్వలను కలిగియున్నాయి.
ఫనీటి సంరక్షణకు ప్రణాళిక
నీరు వృథాగా బయటకు వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా ఫామ్ పాండ్లు, బోర్‌వెల్ రీచార్జి నిర్మాణాలు, ఇంకుడుగుంతలు, మ్యాజిక్ సోక్‌పిట్లు, కమ్యూనిటీ సోక్‌పిట్లు, డ్రెయిన్ ఎండ్ సోక్‌పిట్లు, కాంటూరు కందకాలు, స్టోన్ ట్రెంచెస్ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పొలాల్లో ఫామ్ పాండ్ల ద్వారా నీటిని నిల్వ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో 75 ఫామ్ పాండ్స్ మంజూరు కాగా ఇప్పటికే 12నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇళ్ల వద్ద, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుతో పాటు బోర్‌వెల్ రీచార్జి ద్వారా భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా సోక్‌పిట్ల నిర్మాణాలు చేపడుతూ ఉపాధిహామీ పథకాన్ని నీటి సంరక్షణ పనులతో అనుసంధానిస్తున్నారు. జిల్లాలో భూగర్భ జలాలపై నిరంతర నిఘా పెంచనున్నారు. 2026 సెప్టెంబరు నెలలో జిల్లాలో సగటు భూగర్భ జల మట్టం 3.65 మీటర్లు కాగా ఆగస్టుతో పోలిస్తే 0.82 మీటర్ల మేర నీటి మట్టం తగ్గింది. 2025 సెప్టెంబరుతో పోలిస్తే 1.32 మీటర్ల మేర మెరుగైన స్థితిలో ఉంది. నవంబరులో 5.10 మీటర్ల మేర చేరవచ్చని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 85,974 బోర్‌వెల్స్ ఉండగా వీటిలో 62 శాతం బోర్లు పనిచేస్తున్నాయి. 34 శాతం బోర్లలో నీటి దిగుబడి తక్కువగా ఉండగా మరో 4 శాతం బోర్లు ఎండిపోయాయి.
ఫవరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు..
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో పంటల ఎంపికపై రైతులకు ముందస్తు అవగాహన కల్పించనున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, కందులు, ఇతర పప్పు ధాన్యాలు, కూరగాయల సాగు, ఇతర తక్కవ నీటి వినియోగం కలిగిన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. జిల్లాలో ప్రస్తుతం 35,527 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు, 10,200 ఎకరాల్లో పసుపు, 1,800 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అవుతున్నాయి. మరో 2,419 ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలని ప్రయత్నిస్తున్నారు. భూముల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు అందించనున్నారు. చెరువులు, కుంటల్లో నీటి నిల్వలను అంచనా వేసి చేప పిల్లల విడుదలను నిర్ణయించడంతో పాటు తాగునీటి సరఫరాలోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపుపై తెలంగాణ సాంస్కృతి సారధి బృందం ద్వారా గ్రామాల్లో ఆటపాటలతో అవగాహన కల్పిస్తున్నారు.
ఫఉపాధి పనులపై నజర్
వ్యవసాయ రంగంలో పరిస్థితులు ప్రతికూలంగా మారినా గ్రామీణ కూలీలకు ఉపాధి తగ్గకుండా వచ్చే ఏడాది జూన్, జూలై వరకు ఉపాధి హామీ పనులు కొనసాగించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఇటీవల ఆదేశించారు. ఫామ్‌పాండ్లు, ఇంకుడుగుంతలు, నర్సరీలు, మొక్కల పెంపకం, ఇతర నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో రోజుకు సగటున 60మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుం టున్నారు. తద్వారా కూలీలకు ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉపయోగపడే నీటి సంరక్షణ ఆస్తులను సృష్టించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది.
ప్రజల భాగస్వామ్యంతోనే నీటి సంరక్షణ
-సత్యప్రసాద్, కలెక్టర్
ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే దీర్ఘకాలిక ఫలితాలు సాధ్యమవుతాయి. ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవడం, రైతులు పొలాల్లో ఫామ్ పాండ్లు నిర్మించుకోవడం, చెరువులు, కుంటలు, కాలువలను పరిరక్షించడం, తాగునీటిని పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలి. వ్యవసాయంలో నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకొని, అవసరమైన మేరకే విద్యుత్ వినియోగించాలి. నీట సంరక్షణకు అందరూ నడుం బిగించాలి.