Share News

అన్నదాత చెప్పిందే ధర!

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:30 AM

గత సీజన్‌ దాకా పంట ఉత్పత్తులకు వ్యాపారులు ఇచ్చిందే ధర అన్నట్టుగా ఉన్న పరిస్థితి.. ఈ సారి మాత్రం అన్నదాతలు చెప్పిందే ధర అన్నట్టుగా తయారైంది.

అన్నదాత చెప్పిందే ధర!
Farmers Crop Prices

  • ఆశించిన ధర వస్తేనే అమ్మకం.. లేదంటే నిల్వ

  • పంటను తక్కువ ధరకు అమ్మేందుకు రైతుల ససేమిరా

  • ఖరీఫ్‌ దిగుబడి తగ్గడంతో భారీగా పెరిగిన డిమాండ్‌

  • పచ్చి వడ్లను సైతం కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, ట్రేడర్లు

  • పత్తి, మిర్చి, మొక్క జొన్నకు కూడా రికార్డు స్థాయి ధరలు

  • ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్‌ పరిస్థితి తారుమారు

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గత సీజన్‌ దాకా పంట ఉత్పత్తులకు వ్యాపారులు ఇచ్చిందే ధర అన్నట్టుగా ఉన్న పరిస్థితి.. ఈ సారి మాత్రం అన్నదాతలు చెప్పిందే ధర అన్నట్టుగా తయారైంది. పంట ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. ఆశించిన ధర చెల్లిస్తేనే... అమ్మటానికి సిద్ధపడుతున్నారు. లేదంటే నిల్వ చేసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను చూసి వ్యాపారులు కూడా విస్తుపోయే పరిస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ సీజన్‌లో 17 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, రాష్ట్రంలోని జలాశయాలు, చెరువులు వెలవెలపోయాయి. దీంతో పాత నీటి నిల్వలు, అడపా దడపా వానలతోనే అతికష్టం మీద పంటలు గట్టెక్కాయి. చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోగా, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా.. దిగుబడులు సైతం బాగా తగ్గాయి.


దీనికితోడు యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం క్రాప్‌ హాలీడే ప్రకటించకపోయినా... పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో వ్యాపారులు కూడా పోటీపడి కొంటున్నారు. దీంతో పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ఉదాహరణకు మహబూబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌ పాత రకం జైశ్రీరాం వడ్లకు రూ.5,555 రికార్డు ధర పలికింది. ఆర్‌ఎన్‌ఆర్‌(తెలంగాణ సోనా)కు రూ.4,885, హెచ్‌ఎంటీ రకానికి రూ.4,930 ధర పలికింది. పత్తి క్వింటాల్‌కు ఆదిలాబాద్‌లో రూ.9,260 ధర పలకగా, వరంగల్‌లో గరిష్ఠంగా రూ.9,021, కనిష్ఠంగా రూ.5,300, ఆదిలాబాద్‌లో మొక్కజొన్నకు రూ.3,600 ధర పలికింది. ఖమ్మంలో ఎండుమిర్చికి క్వింటాలుకు రూ.16,200 ధర పలికింది. నిజామాబాద్‌లో పసుపు క్వింటాల్‌కు రికార్డుస్థాయిలో రూ.26,509 ధర పలికింది. సగటున తెలంగాణ సోనా, జైశ్రీరాం, బీపీటీ, సాంబమసూరి లాంటి సన్నాలకు రూ.4,600 చొప్పున ధరలు పలుకుతున్నాయి. సాధారణంగా ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు 17 శాతానికి మించి తేమ ఉంటే వ్యాపారులు కొనుగోలు చేయరు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 25 శాతం తేమ ఉన్న వడ్లను సైతం కొంటున్నారు.


కనీస మద్దతు ధర కంటే అధికంగా ధరలు

సాధారణ పరిస్థితుల్లో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) లభించడమే గగనమవుతుంది. కానీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో... కనీస మద్దతు ధర కంటే అధిక ధరలు పెట్టి వ్యాపారులు పంట ఉత్పత్తులు కొనుగోలుచేస్తున్నారు. వరి ఏ- గ్రేడు ధాన్యానికి ఎమ్మెస్పీ రూ. 2,461, సాధారణ రకానికి రూ.2,441 ఉంది. మధ్యస్థ పింజ పొడువు పత్తికి రూ. 8,267, పొడవు పింజ పత్తికి రూ. 8,667, మొక్కజొన్నకు రూ. 2,410 చొప్పున ఎమ్మెస్పీ ఉంది. ఈ ఎమ్మెస్పీ కంటే ఎక్కువ ధరకు పంట ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. పసుపు, ఎండుమిర్చి పంటలకు ఎమ్మెస్పీ లేకపోయినా... డిమాండ్‌ మేరకు అధిక ధరలు పెట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.


భవిష్యత్తులో ఆహార ధాన్యాల ధరలు మరింత పెరుగుతాయన్న ఉద్దేశంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలుచేస్తుండగా, రైతులు సైతం అదే అంచనాతో ఉన్నారు. ఇప్పుడే తొందరపడి అమ్ముకోవడం ఎందుకనే ఉద్దేశంతో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకుంటున్నారు. అప్పులు, కుటుంబ అవసరాలు, తదుపరి పంట పెట్టుబడుల కోసం నగదు అవసరమైన రైతులు మాత్రమే పంటను విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బియ్యం సహా నిత్యావసర వస్తువుల ధరలన్నీ అమాంతం పెరిగాయి. కొరత లేనప్పటికీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్లో రైతులకు మెరుగైన ధరలు లభించటం సానుకూల పరిణామమే అయినా... నిత్యావసర ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. హరీశ్‌రావుపై కొత్త ఎఫ్‌ఐఆర్‌

3 రోజుల పాటు భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 04:30 AM