చేపపిల్లల పంపిణీపై నీలినీడలు
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:43 AM
మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీపై ఈసారి కూడా నీలినీడలే కమ్ముకున్నాయి. గత ఏడాది ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలుపెట్టింది. కాంట్రాక్టర్లు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. సమయం దాటిపోవడంతో 50శాతానికి చేపపిల్లల పంపిణీ లక్ష్యంగా మార్చుకున్నా దానిని కూడా పూర్తి చేయలేకపోయారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీపై ఈసారి కూడా నీలినీడలే కమ్ముకున్నాయి. గత ఏడాది ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలుపెట్టింది. కాంట్రాక్టర్లు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. సమయం దాటిపోవడంతో 50శాతానికి చేపపిల్లల పంపిణీ లక్ష్యంగా మార్చుకున్నా దానిని కూడా పూర్తి చేయలేకపోయారు. 2024-2025 సంవత్సరానికి రూ.1.59 కోట్ల విలువైన 1.41 కోట్ల చేప పిల్లల సరఫరాకు టెండర్లు పిలిచినా చివరకు 46.71 లక్షల చేపలను 324 చెరువులు, కుంటల్లో వదిలారు. ఈసారి ముందస్తుగానే రుతుపవనాలు పలకరించినా చేపపిల్లల టెండర్ల ఊసే లేకుండా పోయింది. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ నీలి విప్లవాన్ని సాధించే దిశగా మొదలుపెట్టిన చేప పిల్లల పంపిణీ ఈసారి కూడా వర్షాలు సమృద్ధిగా కురిసే సమయంలో పంపిణీ చేసే పరిస్థితి లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతలతో శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్ట్, అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌తో పాటు చెరువులు, కుంటల్లో నీళ్లు మండుటెండలోనూ జలకళ ఉండడంతో సకాలంలోనే చేపపిల్లల పంపిణీ గతంలో చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఏర్పడ్డ అవాంతరాలతో ఎత్తిపోతలు నిలిచిపోయాయి. మిడ్‌మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లతో పాటు చెరువులు, కుంటల్లో నీళ్లు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తేనే నీళ్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులో పంపిణీ ఉంటుందా లేదా అనే సందేహాలు మత్స్యకారుల్లో ఏర్పడ్డాయి.
జిల్లాలో 168 మత్స్య పారిశ్రామిక సంఘాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో నిత్యం నీటిపై పోరాటం చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. జిల్లాలో మత్స్య శాఖ పరిధిలో 401 చెరువులు ఉన్నాయి. 168మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, 9,220 మంది సభ్యులు ఉన్నారు. 48 మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, రెండు ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం వరకు మిడ్ మానేరులో చేపలు పట్టడానికి 741 మంది మత్స్యకారులకు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో 251మంది, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లో 52 మంది మత్స్యకారులకు లైసెన్స్‌లు జారీ చేశారు.
నీటి మీద బతుకు పోరాటం...
ఏటికి ఎదురీదినా కష్టాలే పయనం సాగిస్తున్నాయి. కమ్ముకున్న మంచులోనూ.. చలివేసినా.. వానొచ్చినా.. భుజాన బుట్ట చేతిలో వలతో మత్స్యకార్మికుడు సాగిపోతాడు. వాగులో.. చెరువులో నిద్రిస్తున్న కెరటాలు ఉవ్వెత్తున ఎగిసినా గంగమ్మతల్లిని నమ్ముకొని క్షణం తీరికలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఉరుములు మెరుపులకు గుండెల్లో భయానికి తావివ్వకుండా ప్రకృతి ఆవేశాలకు కాస్త వెనకడుగు వేసినా తిరిగి తన బతుకు పోరాటాన్ని కొనసాగిస్తాడు. వారి బతుకు నిత్యం ఒడ్డున పడ్డ చేపలా విలవిల్లాడినా కుటుంబాలను పోషించుకోవడానికి చేపలు వేసే ఎత్తుకు పైఎత్తు వేస్తూ వేట సాగిస్తాడు. జిల్లాలో మత్స్యకార్మికులు కరువుతో చెరువులు ఎండిపోతూ ఉంటే బతుకు చేజారిపోతున్నట్లుగానే భావిస్తాడు. మనుషుల జీవనంలో ఆహారంలో ముఖ్యమైన వాటిలో చేపలు కూడా ఒకటి. ఆ చేపలను విభిన్న రుచుల్లో ఆస్వాదించడానికి ఇష్టపడుతారు.
జిల్లాలో ఎన్నెన్నో రకాల చేపలు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతలతో ఎన్నెన్నో రకాల చేపలు జిల్లా ప్రజలకు చేరువయ్యాయి.
తెలంగాణ చేప కొర్రమట్ట
బొమ్మె, కొర్రమట్ట, కొర్రమీను, మొట్ట, మరల్.. ఇలా వివిధ పేర్లలో పిలిచే చేపల్లో వీటినే రారాజుగా పిలుస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తింపును ఇచ్చింది. కొన్నిచోట్ల చేపలను గాలం ద్వారా పట్టడానికి ఎరగా కప్పలను ఉపయోగిస్తారు. వీటిని కప్ప గాలాలుగా పిలుస్తారు. ఎర్రలకు ఈ చేపలు పడవు. కప్పలు నీటిపై భాగన తేలేటట్లు ఉబ్బిస్తారు. అలా ఉబ్బిన కప్ప తేలుతూ కదులుతూ ఉంటుంది. మరల్ వచ్చి దాన్ని నోట కరుచుకుంటుంది. చేపను కూడా అదే పద్ధతిలో పడుతారు. చిన్న రకం చేపలను వలతో పడుతారు.
తొందరగా ఎదిగే రహు
చేపల్లో శాఖాహారి రహు(రవులు) చేపలు. మార్కెట్లో ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. ఇవి హైబ్రీడ్ రకం చేపలు. వీటిని మత్స్యకార్మికులు స్వయంగా పెంచుతారు.
మార్పులు.. గురిజెలు...
చేపల్లో కూడా గాలాన్ని మింగేటివి ఉంటాయి. వాటి చేష్టలను కూడా మత్స్యకార్మికుడు గమనిస్తాడు. గాలి బుడగల రూపంలో పైకి రావడం అడ్డంగా ఉన్న బెండు నిలువుగా మారుతుంది. అది నిటారుగానే నీటిలోకి వెళుతుంది. దాన్ని గమనించి అది మార్పు చేపగా గుర్తిస్తారు. తక్కువగా వస్తే గురిజెగా భావిస్తారు. ఇంగ్లీకాలకు, జెల్లలకు ముల్లు ఉంటాయి.
పాములా ఉండే పాపెర...
బండల కింద దాక్కొని ఉండే చేపల్లో పాపెర ఒకటి. పాములాగా ఉండే పాపెరకు ముల్లు కూడా ఉంటాయి. వీటిని పట్టడానికి చిన్నచిన్న గాలాలను ఉపయోగిస్తారు. పాములాగా ఈ చేప మెలికలు తిరుగుతూ ఉంటుంది.
అమాయకపు చేప పంకిరి...
చేపల్లో కూడా అమాయకపు తత్వం ఉండేటివి ఉంటాయి. పంకిరి చేపల్లో మెదడు అనేది ఉండదని భావిస్తారు. ఎన్నిసార్లు గాలంతో దెబ్బతిన్నా మళ్లీ గాలాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాయి. కొన్ని చేపలు ఒకసారి గాలం తగిలితే దొరకుండా పారిపోతాయి. పంకిరి చేపలు మాత్రం గాలానికి చిక్కుతాయి. దీన్ని మాలపంకిరి చేపలుగా కూడా పిలుస్తారు.
చందమామలు...
చందమామలు పేరుకు తగ్గట్లుగానే వీటికి పట్టుకోవడానికి విభిన్న పద్ధతులను అవలంబిస్తారు. గాలాన్ని వేసి ఎదురుగా లాగుతూ పోతారు. గాలాన్ని పైపైనే లాగుతూ ఉంటే ఇవి చిక్కుతాయి. చంద్రవంక ఆకారంలో తెల్లగా ఉంటాయి.
పరకలు...
శక్తి తక్కువగా ఉండి, ఊరికే గాలాన్ని కొరుకుతూ ఆటలాడుతుంటాయి. చాలా చిన్నగా ఉంటాయి. నిలకడగా ఉండకుండా గెంతుతుంటాయి. వీటికి శక్తి తక్కువగా ఉంటుంది. వీటిలో మరీ చిన్నవి బుడ్డపరకలతో పోల్చుతారు.
మొయ్యలు.. ఉలిసెలు..
మొయ్యలు నాచు గడ్డి తింటాయి. వీటిని పట్టడానికి గడ్డి చిలుకలను ఉపయోగిస్తారు. ఇవి గడ్డిగా భావించి మింగటానికి వచ్చి దొరికిపోతాయి. ఉలిసెలు ఇవి ఇసుకలో ఎక్కువగా ఉంటాయి. ఇవి గాలాన్ని మింగలేవు. చిన్న గాలాలను ఉపయోగిస్తారు.
కొడిపెలు... పరకలు...
నీటి ప్రవాహంలో కొడిపెలు, పరకలు, గండ పరకలు, గెచ్చులు, వాగు గెచ్చులు దొరుకుతాయి. ఇవి ఎదురీదుతూ ఉంటాయి. వీటిని గాలంతో కాకుండా మామూలుగానే పట్టుకుంటారు.
జెల్లలు...
చేపల్లో రుచికరంగా ఉండే వాటిలో జెల్లలు ఒక రకమైనవి. పెద్ద పెద్ద రాతి బండలు ఉన్న చోట ఉంటాయి. గాలాన్ని పూర్తిగా మింగకుండా ఒక పంటితో కరుచుకుపోయే ప్రయత్నం చేస్తాయి. అందుకే ఈ చేపను పట్టడం కొంచెం కష్టంగానే భావిస్తారు. ఒక పక్కకు లాగుతూ ఉంటుంది. గాలాన్ని వ్యతిరేకంగా లాగితేనే చిక్కుతుంది.
చేపపిల్లలు చెరువులు/కుంటలు/జలాశయాల్లో వదిలిన తీరు
సంవత్సరం చెరువులు/కుంటలు/జలాశయాలు వదిలినవి
2016- 17 92 30.5 లక్షలు
2017- 18 66 20 లక్షలు
2018- 19 95 57.48 లక్షలు
2019- 20 313 100.91 లక్షలు
2020- 21 362 115.61 లక్షలు
2021- 22 392 119.25 లక్షలు
2022 -23 392 138.27 లక్షలు
2023 -24 440 141.00 లక్షలు
2024-25 324 46.71 లక్షలు