మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: డీజీపీ ఆనంద్
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:52 AM
మాదక ద్రవ్యాల నిరోధానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల నిరోధానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతున్నామని పేర్కొన్నారు. 2029 డిసెంబర్ 31వ తేదీలోగా డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అందుకోసం ఎన్నో కార్యక్రమాలు, వ్యూహాలను మనం చూడబోతున్నామని తెలిపారు. డ్రగ్స్ హానికరమని.. ఇవి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు డీజీపీ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ ఏక్తా దివస్–2026 సందర్భంగా ఈరోజు (శనివారం) ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాతీయ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో మాదకద్రవ్యాల నిర్మూలన, డ్రగ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ సీవీ ఆనంద్ హాజరై, ప్రసంగించారు. ఆరు రోజుల క్రితం వివిధ రాష్ట్రాల్లో ఈ ర్యాలీ ప్రారంభమైందని వెల్లడించారు. ఈ ర్యాలీలో ఐదు రాష్ట్రాల వారు పాల్గొన్నారని అన్నారు.
నషా ముక్త్ భారత్ థీమ్ పేరుతో ఏక్తా దివస్ ర్యాలీ..
ఐదు రోజుల తర్వాత ఈ ర్యాలీ నేడు హైదరాబాద్ చేరుకుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ నుంచి ఏడుగురు మోటార్ సైకిల్ ర్యాలీలో జాయిన్ అవుతారని చెప్పారు. అక్టోబర్ 30వ తేదీన ఈ ర్యాలీ గుజరాత్ రాష్ట్రం కెవాడియా చేరుకుంటుందని తెలిపారు. ఆరోజు కెవాడియాలో జరిగే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. భారతదేశంలో ఎన్నో సంస్కృతి సంప్రాదాయాలు ఉన్నాయని తెలిపారు. మనం అందరం భారతీయులమని చాటి చెప్పేందుకే ఈ ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహిస్తున్నామని వివరించారు. నషా ముక్త్ భారత్ థీమ్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
డ్రగ్స్ దుష్ప్రభావాలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి..
కాగా, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా నిర్వహించనున్న జాతీయ మోటార్‌సైకిల్ ర్యాలీని డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించడంపై ఈగల్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఆయా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు.
మెహదీపట్నం మీదుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ ర్యాలీ చేరుకోనుంది. అలాగే, సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పటాన్చెరు మీదుగా ఐఐటీ కందికి మోటార్‌సైకిల్ ర్యాలీ చేరుకోనుంది. అక్కడి నుంచి కర్ణాటకలోని జహీరాబాద్ ఉమ్దాబాద్ వైపు ర్యాలీ కొనసాగనుంది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈగల్ ఫోర్స్ ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టిసారించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సమాజమంతా ఏకం కావాలని ఈగల్ ఫోర్స్ అధికారులు సందేశమిచ్చారు. జాతీయ ఐక్యత, సామాజిక బాధ్యత, మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటమనే అంశాలతో ఈగల్ ఫోర్స్ అధికారులు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను కిరాయి మనుషులతో కేటీఆర్ తిట్టిస్తున్నారు.. కవిత ధ్వజం
మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి సాగు.. పోలీసుల ఉక్కుపాదం
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News