ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌ను ఆస్వాదించండి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:06 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్ క్రీడపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
హైదరాబాద్, జులై 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) మరోసారి ఫుట్‌బాల్ క్రీడపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఫుట్‌బాల్ ప్రేమికులకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఫుట్‌బాల్ కేవలం ఓ క్రీడ మాత్రమే కాదని, యువతలో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే శక్తివంతమైన వేదిక అని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిని హైదరాబాద్‌కు తీసుకురావడం తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక మరపురాని ఘట్టమని గుర్తుచేశారు.
ఫిఫా వరల్డ్ కప్‌నకు మద్దతు ఇవ్వడం వెనుక కేవలం క్రీడా ప్రోత్సాహమే కాకుండా, భారత ఫుట్‌బాల్ భవిష్యత్తుపై ఉన్న గొప్ప విజన్ కూడా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భారత్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆడే స్థాయికి చేరుకుంటుందనే పూర్తి విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒక రోజు భారత్ ఫిఫా వరల్డ్ కప్‌నకు ఆతిథ్యం కూడా ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత ఫుట్‌బాల్‌లో తెలంగాణ యువత కీలక పాత్ర పోషిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు భారత ఫుట్‌బాల్ స్టార్లలో తెలంగాణకు చెందిన ఆటగాళ్లు తప్పకుండా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణా అవకాశాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌ను ఆస్వాదించాలని, క్రీడాస్ఫూర్తిని గౌరవించాలని ఫుట్‌బాల్ అభిమానులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ ప్రాణం పోశారు: సీఎం రేవంత్‌రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు అరెస్ట్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News