ఫాంహౌస్‌లో కుట్రపై సమగ్ర విచారణ: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:40 PM
బీఆర్ఎస్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్‌లో కుట్రకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాంహౌస్‌లో కుట్రకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు. సభను అడ్డుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు (బుధవారం) అసెంబ్లీలో ముఖ్యమంత్రి పలు అంశాలపై మాట్లాడారు. మూడు రోజుల ఘటనలకు ఫాంహౌస్ సాక్షిగా కుట్ర జరిగిందని ఆరోపించారు. అసెంబ్లీ ఘనటలపై విచారణకు ఆదేశించామని అన్నారు. దళితులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం.. విద్వేషాలు, అల్లర్లు రెచ్చగొట్టడం నేరమని హెచ్చరించారు. దళితులపై అణచివేత, దురాగతాలకు పాల్పడిన వారిని.. చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుట్ర చేసిన వారితో పాటు అమలు చేసిన వారిని.. కోర్టులో నిలబెట్టి శిక్షించాలని నిర్ణయించామని అన్నారు.
విచారణ అధికారిగా ఐపీఎస్ విజయ్‌కుమార్..
ఈ ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. విచారణ అధికారిగా ఐపీఎస్ విజయ్‌కుమార్‌ను నియమించామని వెల్లడించారు. ఈనెల 6వ తేదీన ఫాంహౌస్‌లో కుట్ర జరిగిందని ఆరోపించారు. 7వ తేదీన స్పీకర్‌పై మాటల దాడి జరిగిందని అన్నారు. 8వ తేదీన శుద్ధి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు.. కుట్ర చేసిన అందరిపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కోర్టు బెయిల్ ఇవ్వొచ్చేమో గానీ.. సమాజం మాత్రం బెయిల్ ఇవ్వదని చెప్పారు. అసెంబ్లీ ఘనటలపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు.
కేసీఆర్ కుట్ర పన్నారు..
ప్రజా సమస్యలపై చర్చ కోసమే తాము అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 22ఏ భూములు సహా అన్ని అంశాలను చర్చించాలనుకున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలపై చర్చ జరిగితే వారికి రాజకీయ సమాధి తప్పదని అసెంబ్లీ సమావేశాలపై కుట్ర చేశారని ఆగ్రహించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందురోజు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పిలిపించుకుని కుట్ర పన్నారని ఆగ్రహించారు. అసెంబ్లీ సమావేశాలు జరగకుండా కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు.
ఉత్తరాఖండ్ ఘటనే.. తెలంగాణలో జరిగింది..
‘ఉత్తరాఖండ్‌లో గతంలో జరిగిన ఘటనను ఖండిస్తూ రాష్ట్రపతికి మేము ఫిర్యాదు చేశాం. దురదృష్టవశాత్తు అలాంటి ఘటనే మన తెలంగాణలో జరిగింది. కొంతమంది వచ్చి మన అసెంబ్లీ ఎదుట.. బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులపై దాడి చేశారు. స్పీకర్‌తోపాటు వారి తల్లిని అవమానించారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను సమాజమంతా ఖండించింది. ఏ ఫాంహౌస్‌లో కుట్రలు చేశారో.. అక్కడే నిరసన తెలపాలని దళితులు నిర్ణయించుకున్నారు. ఫామ్‌హౌస్‌లో పన్నిన కుట్రలకు వ్యతిరేకంగానే.. అక్కడ నిరసన తెలపడానికి వారు వెళ్లారు.. దాడుల కోసం కాదు. ప్రజాస్వామిక పద్ధతిలో డప్పు కొట్టి దండోరా వేయడం ద్వారా.. తమ మనసులోని భావాలను దళితులు వ్యక్తీకరించారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ అంటే ప్రజలకు ఓ నమ్మకం..
‘కాంగ్రెస్ అంటే ప్రజలకు ఓ నమ్మకం, విశ్వాసం. గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ ఆవిర్భవించింది. దేశం కోసం ఈ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది. అణచివేత, వివక్షకు లోనైన జాతుల అభివృద్ధి కోసం.. రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు.. మన దేశాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ మాత్రమే. బ్రిటిష్ వారి దోపిడీ, దుర్మార్గాలపై పోరాడింది ఈ పార్టీనే. మన రాజ్యాంగం భారత్‌ను ప్రపంచ దేశాల ఎదుట.. గర్వంగా నిలబడేలా చేసింది’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్
శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ఆలోచన మాకు లేదు: స్పీకర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News