Share News

ప్రధాని మోదీ - 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి రాష్ట్రాల సహకారం అవసరం: సీఎం రేవంత్

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:58 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని.. ఇందుకు రాష్ట్రాల సహకారం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని.. అభివృద్ధి విషయంలో కాదని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ - 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి రాష్ట్రాల సహకారం అవసరం: సీఎం రేవంత్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) - 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని.. ఇందుకు రాష్ట్రాల సహకారం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని.. అభివృద్ధి విషయంలో కాదని స్పష్టం చేశారు. 2047 నాటికి స్వతంత్ర భారతం వందేళ్లు పూర్తి చేసుకోబోతుందని తెలిపారు. సమాఖ్య అనే పదానికి చాలా బలం ఉందని చెప్పుకొచ్చారు. పురాతన కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యాపారం చేసేవారని పేర్కొన్నారు. ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం చాలా ఉందని వెల్లడించారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్ హైటెక్స్‌లో సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి, ప్రసంగించారు.


అందరికీ ఆదర్శంగా మున్నూరు కాపు సామాజిక వర్గం..

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి సమాఖ్యలు చాలా ఉపయోగపడుతాయని వివరించారు. కొత్త తరం అభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వివిధ హోదాల్లో రాణించారని కొనియాడారు. ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాదని.. అందరికీ ఆదర్శంగా వారు నిలిచారని ఉద్ఘాటించారు. సక్సెస్ స్టోరీలను సమాఖ్య నిక్షిప్తం చేసి కొత్త తరానికి అందించాలని పిలుపునిచ్చారు. అందుకే 2025లో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశామని ప్రస్తావించారు.


తెలంగాణను మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం..

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రాన్ని CURE, PURE, RARE అని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్ఘాటించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని CURE – (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)గా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ ఐటీ, సేవా రంగాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని PURE (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ)గా అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు. ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ రంగాలను ప్రోత్సహిస్తామని అన్నారు. మిగిలిన గ్రామీణ ప్రాంతాలను RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ)గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.


తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం..

ఇక్కడ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని అన్నారు. దీన్ని 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని వివరించారు. నాలుగు వందల ఏళ్ల క్రితమే దేశ, విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్‌గా మారిందని ఉద్ఘాటించారు. చార్మినార్ తర్వాత బిజినెస్‌కు ల్యాండ్ మార్క్.. హైటెక్ సిటీ అని చెప్పుకొచ్చారు. నూతన పారిశ్రామిక విధానంలో మీరంతా భాగస్వాములు కావాలని సూచించారు. ఇప్పటి వరకు మనవాళ్లు కేవలం కార్పొరేట్ కంపెనీలకు సర్వీస్ చేసే వైపు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. మన ప్రాంతానికి చెందిన వాళ్లు పెట్టుబడులు పెట్టి గ్లోబల్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.


మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలే ఆర్థికంగా బలపడ్డాయి..

ఒకసారి మనం ప్రపంచాన్ని గమనిస్తే.. మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలే ఆర్థికంగా బలపడ్డాయని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో మహిళలకు రూ. 61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు, పెట్రోల్ బంకులకు, సోలార్ ప్లాంట్స్‌కు మహిళలను యజమానులను చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సీఎం ఓ సూచన చేశారు. యువతతో పాటు మహిళలను ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని తెలిపారు. మంచి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని వెల్లడించారు. ‘మీ పెట్టుబడులకు మా భరోసా’ ఉంటుందని భరోసా కల్పించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా ముందుకెళ్దామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


సమాఖ్య సమ్మిట్‌కు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామ కృష్ణమ రాజు, ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దానం నాగేందర్, మున్నూరు కాపు ఫౌండేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జస్టిస్ భవానీ ప్రసాద్, కరీంనగర్ గ్రంథాలయ ఛైర్మన్ సత్తు మల్లేశ్, తదితరులు హాజరయ్యారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు SAMAKHYA Chamber of Commerce (SCC) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో సమాఖ్య (SAMAKHYA) బిజినెస్ సమ్మిట్-2026 జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం

హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల గుడ్‌విల్?.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లో క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ దోపిడీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:02 PM