Share News

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం

ABN , Publish Date - Jul 08 , 2026 | 08:43 PM

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ దుష్ప్రచారం చేస్తోందని కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం
Kishan Reddy

ఢిల్లీ, జులై 8 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ దుష్ప్రచారం చేస్తోందని కిషన్‌రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో విఫలమైందని ధ్వజమెత్తారు. ఈరోజు(బుధవారం) కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని (Prahlad Joshi) తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో కలిశారు. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్రమంత్రికి బీజేపీ నేతలు విజ్ఞాపనపత్రం అందజేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, పాయల శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.


ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది..

తాము చేపట్టిన రైతు గోస ఉద్యమం తర్వాత ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైస్ మిల్లుల్లో మిల్లింగ్ వేగవంతం చేసి FCIకి బియ్యాన్ని పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, మిల్లింగ్‌లో సరైన విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఖరీఫ్ 2024-25లో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరిస్తే ఈరోజు వరకు 13 నుంచి 14 శాతం బియ్యం కూడా ఎందుకు పంపలేదని ప్రశ్నించారు.


కేంద్రం రుణాలు ఇస్తోంది..

2024-26 ఖరీఫ్ సీజన్‌లోని బియ్యం ఇంకా FCIకి చేరలేదని కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదేవిధంగా వ్యవహారించారని చెప్పుకొచ్చారు. ధాన్యం కొనుగోళ్ల కోసం NCDC ద్వారా రాష్ట్రాలకు కేంద్రం రుణాలు ఇస్తోందని వివరించారు. 2024-26లో రూ.37 వేల కోట్లు రాష్ట్రానికి రుణాలు ఇచ్చామని వెల్లడించారు. 2026-27లో కూడా సుమారు రూ.23 వేల కోట్లు రుణాలు ఇచ్చామని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ధర్నా చేయాలని.. వాస్తవాలు చెబుతామని అన్నారు. కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. రైతుల ధాన్యం ఉత్పత్తి స్థాయికి తగ్గట్లుగా మౌలిక వసతులు పెంచాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇచ్చే సన్నబియ్యంలో 70 శాతం నిధులను కూడా కేంద్రమే ఇస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం: రఘునందన్ రావు

mp-raghu.jpg

తెలంగాణ రైతాంగం పండించిన పంట సేకరణ విషయంలో 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Medak MP Raghunandan Rao) పేర్కొన్నారు. తాము చేపట్టిన రైతు గోస ద్వారా రైతుల ఆందోళనను స్వయంగా చూశామని తెలిపారు. తెలంగాణ రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించినందకు కేంద్రమంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు. 2013-14లో అప్పటి యూపీఏ- 2లో కాంగ్రెస్ ప్రభుత్వం 24.32 లక్షల మెట్రిక్ టన్నులనూ మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేసిందని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో కేంద్రప్రభుత్వం 146.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.


మోదీ హయాంలో ఆరు రెట్లు ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేశాం..

కాంగ్రెస్ హయాంలో కొన్నదానికంటే 6 రెట్లు ఎక్కువగా మోదీ హయాంలో కొనుగోలు చేశామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. వరికి రూ.2369 MSP చెల్లిస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో వరికి రూ.1300 MSP ఇచ్చిందని తెలిపారు. వడ్ల కొనుగోలుకు రూ.34891 కోట్లని తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు, రైతుల పక్షాన తాము నిలబడతామని మాటిచ్చారు. ధాన్యం కొనుగోళ్లను కేంద్రం చేస్తే మర ఆడించి బియ్యం పంపడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఎందుకు పడుతోందని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డిజిటల్ గవర్నెన్స్‌తో పారదర్శక పరిపాలన అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 08 , 2026 | 10:02 PM