మెడికల్ పీజీ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:56 PM
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టును వైద్య విద్య కళాశాల యాజమాన్యాలు ఆశ్రయించాయి. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని తెలిపాయి.
ఢిల్లీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టును (Supreme Court) వైద్య విద్య కళాశాల యాజమాన్యాలు ఆశ్రయించాయి. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని తెలిపాయి. ఆ తేదీకి ఆంధ్రప్రదేశ్‌లో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానం దృష్టికి కాలేజీ యాజమాన్యాలు తీసుకువచ్చాయి. వీటిలో ఏపీలో సుమారు 45 కన్వీనర్ కోటా సీట్లు కూడా ఉన్నాయని జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం దృష్టికి యాజమాన్యాల తరపు న్యాయవాదులు తీసుకువచ్చారు. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, కానీ... గడువు ముగియడంతో కౌన్సెలింగ్ ముగించారని యాజమాన్యాలు ప్రస్తావించాయి.
గడువు పెంచాలని ఫిబ్రవరి 28వ తేదీకి ముందే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి సంబంధిత యూనివర్సిటీలు, కాలేజీలు విజ్ఞప్తి చేశాయి. యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సమాధానం రాలేదని కోర్టుకు న్యాయవాదులు చెప్పారు. ఇదే పరిస్థితి తలెత్తితే కర్ణాటక, మహారాష్ట్రల్లో గడువు పెంచారని, కానీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం గడువు పెంచేందుకు నిరాకరించాయని న్యాయవాదులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కోర్టు ముందు న్యాయవాదులు ఉంచారు. వైద్య విద్య కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ధర్మాసనం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఎన్‌ఎంసీకి పిటిషన్ కాపీలు అందజేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకి చెప్పారు. అయితే, ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సోమవారం (23న) చేపడతామని జస్టిస్ పీఎస్ నర్సింహ ధర్మాసనం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విప్‌ల నియామకం..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు
Read Latest Telangana News And AP News And International News And Telugu News