కేటీఆర్ అండ్ కో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు.. మంత్రి పొంగులేటి ధ్వజం
ABN , Publish Date - Feb 26 , 2026 | 08:52 PM
బావా, బావమరిది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): బావా, బావమరిది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా కేటీఆర్ అండ్ కో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఆగ్రహించారు. ఏ ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ ప్రజాదరణ పొందుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గెలుపును జీర్ణించుకోలేక బావ, బావమరిది, ఫాంహౌస్ నాయకులు.. ప్రజలు అసహ్యించుకునేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ(గురువారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ప్రాజెక్టులు, నదీ జలాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే తక్కువ ఖర్చుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు పనుల కోసం రూ.5, 600కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అలాంటి ప్రాజెక్టు కాదని వారి అకౌంట్లు నింపుకోవడానికి కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేకమేడలా కూలింది..
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 162 టీఎంసీలు లిఫ్ట్ చేసి 60 టీఎంసీలు తిరిగి సముద్రంలోకి వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అద్భుతమని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అధికారంలో ఉండగానే పేకమేడలా కూలిందని ఎద్దేవా చేశారు. పిల్లర్లు కుంగిపోయాయని.. బ్యారేజీలు లీక్ అయ్యాయని అన్నారు. కమిషన్‌తో విచారణ జరిపిస్తే వారి గట్టు రట్టు అయిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగిస్తే ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. అది బీజేపీ, బీఆర్ఎస్ బంధానికి నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం, సీతారామ కింద ఆయకట్టు రాలేదని చెప్పారు. బావ, బావమరుదులు రంకెలు వేయడం తప్పా.. చర్చకు రారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీకి రమ్మంటే రారు..
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే రారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ హక్కులు వదులుకోమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని అన్నారు. అయినా వారి యూట్యూబులతో వంకర మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో కమిషన్ వచ్చే పనులు మాత్రమే చేశారని.. అయినా ఆ ప్రాజెక్టులను తాము సరిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ ప్రారంభం అవుతోందని.. పారిపోకుండా రండి అన్ని అంశాలపై చర్చిద్దామని సవాల్ విసిరారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా రావాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ స్వార్థం వల్ల రాష్ట్రం 15ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆగ్రహించారు.
ఖమ్మం వెలుగుమట్ల ఘటనపై పొంగులేటి స్పందన..
ఖమ్మం వెలుగుమట్ల ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. పేదలు కాంగ్రెస్ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. తమది పేదల ప్రభుత్వమని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ మేరకు వెలుగుమట్లలో భూదాన్ భూములని కులగొట్టింది వాస్తవమేనని చెప్పుకొచ్చారు. వెలుగుమట్లలో 2023లో బీఆర్ఎస్ కూడా అక్కడ ఇళ్లు కూలగొట్టిందని ప్రస్తావించారు. ఖమ్మంలో నష్టపోయిన నిరుపేదలందరికీ న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మాటిచ్చారు. కేటీఆర్ అండ్ కో చేసే గ్లోబల్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్
ఖర్గేని కలిసిన జగ్గారెడ్డి.. అసలు విషయమిదే..
Read Latest Telangana News And AP News And Telugu News