Minister Damodar:పేదలకు అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యం: మంత్రి దామోదర్
ABN , Publish Date - Jan 19 , 2026 | 07:52 PM
పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన తులసి థెరప్యుటిక్స్ సహకారంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి19 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) వ్యాఖ్యానించారు. పీపీపీ పద్ధతిలో తులసి థెరప్యూటిక్స్‌తో కలిసి స్టెమ్ సెల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. నిమ్స్‌లో స్టెమ్ సెల్ ల్యాబ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడారు. అమెరికాకు చెందిన తులసి థెరప్యుటిక్స్ సహకారంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఒక పెద్ద వృక్షానికి విత్తనం ఎంత ముఖ్యమో.. మన శరీరానికి స్టెమ్ సెల్స్ అంతే ముఖ్యమని వివరించారు.
స్టెమ్ సెల్స్ నుంచి కొత్త కణాలు..
స్టెమ్ సెల్స్ నుంచి కొత్త కణాలను, అవయవాలను తయారు చేయొచ్చని మంత్రి దామోదర్ రాజనర్సింహ వివరించారు. మన శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు భాగాన్ని రిపేర్ చేసే అద్భుతమైన శక్తి.. మూల కణాలకు ఉంటుందని వెల్లడించారు. మందులతో నయం కాని మొండి వ్యాధులను కూడా నయం చేయగలిగే శక్తి ఈ స్టెమ్ సెల్స్‌కు ఉందని తెలిపారు. క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి జబ్బులతో బాధపడేవారికి ఈ చికిత్స సంజీవని లాంటిదని చెప్పుకొచ్చారు. ఆయా వ్యాధుల వల్ల శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని మళ్లీ కొత్తగా సృష్టించేందుకు ఈ చికిత్స ఉపయోగపడుతుందని వెల్లడించారు.
అత్యాదునిక వైద్య సేవలు..
ప్రస్తుతం స్టెమ్ సెల్ చికిత్స కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లోనే అందుబాటులో ఉందని... అది కూడా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సామాన్యులకు కూడా అత్యాదునిక వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో నిమ్స్‌లో స్టెమ్ సెల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో స్టెమ్ సెల్స్‌పై లోతైన పరిశోధనలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. పరిశోధనల ఫలితంగా, భవిష్యత్తులో నిమ్స్‌లోనే పేషెంట్లకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్ సెల్ థెరపీ అందించగలుగుతామని తెలిపారు. త్వరలోనే ఈ ల్యాబ్ రీసెర్చ్ ఫలాలు ప్రజలకు అందుతాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జన్వాడ భూముల కేసు.. కోర్టు ఆదేశాలివే..
తెలంగాణ నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News