KTR: తెలంగాణ నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే: కేటీఆర్
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:41 PM
కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందని, వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, జనవరి19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందని, వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ విషయంపై కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కి కేటీఆర్ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. సిరిసిల్లలో 'మెగా పవర్ లూమ్ క్లస్టర్' ఏర్పాటు చేయాలనే డిమాండ్ నిన్న, మొన్నటిది కాదని, గత పదేళ్లుగా దీనిపై తాము నిరంతరాయంగా పోరాడుతున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, సిరిసిల్లా శాసన సభ్యుడిగా కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేశానని తెలిపారు. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయానికి రాకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
సిరిసిల్లకు అన్ని అర్హతలు..
సిరిసిల్ల క్లస్టర్ ఏర్పాటు కోసం గత పదేళ్లలో సుమారు పదిసార్లు కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి మెగా పవర్ లూం క్లస్టర్ కోసం నివేదికలు, వినతులు ఇచ్చామని గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ మొదలుకొని నేటి మంత్రి వరకు ప్రతి ఒక్కరినీ బతిమిలాడామని ప్రస్తావించారు. సీపీసీడీఎస్CPCDS) నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధ్రువీకరించినా, ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటి? అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, తెలంగాణ అభివృద్ధిని, ముఖ్యంగా ఇక్కడి నేతన్నలపై కేంద్రం చూపుతున్న వివక్షనేనని ధ్వజమెత్తారు. సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయని కేటీఆర్ పేర్కొన్నారు. అక్కడ 30 వేలకు పైగా పవర్ లూమ్స్ కలిగి ఉండి, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం, అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్టమని ఆరోపించారు. సిరిసిల్లకు మెగా క్లస్టర్ రాకపోవడానికి కారణం మెరిట్ లేకపోవడం కాదని, కేంద్రానికి తెలంగాణపై ఉన్న కక్షేనని కేటీఆర్ విమర్శించారు.
పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటు..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, నిరంతర విద్యుత్, నీరు, సింగిల్ విండో అనుమతులు, రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాలు.. ఇలా ప్రతి ఒక్క అర్హతను పూర్తి చేసిందని వివరించారు. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయని పదేపదే చెబుతున్నా, ఎటువంటి సాంకేతిక లేదా ఆర్థిక కారణాలు చూపకుండా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. ఒకవైపు 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' అని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం, దేశంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన సిరిసిల్ల వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రానికి మద్దతు ఇవ్వకపోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద నీతికి, చిత్తశుద్దిలేని తనానికి అద్దంపడుతోందని ఆక్షేపించారు. బీజేపీ ప్రభుత్వం కేవలం నినాదాలకే పరిమితం అయిందని విమర్శించారు. కేంద్రం చేస్తున్న ఈ జాప్యంతో సిరిసిల్లా నేతన్నలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు.
సంక్షోభంలో చేనేత రంగం..
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ విమర్శించారు. మళ్లీ ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచిందని.. కానీ నేడు పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు. ఇటువంటి కీలక సమయంలో కేంద్రం జోక్యం చేసుకుని మెగా క్లస్టర్‌ను మంజూరు చేయాల్సి ఉండగా, తీవ్రమైన జాప్యం చేయడం నేతన్నల పొట్ట కొట్టడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రుల వైఫల్యం..
సమాఖ్య ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అనేది రాజకీయ ప్రయోజనాల అధారంగానో లేక తాము అధికారంలో ఉన్న ఎంపిక చేసిన రాష్ట్రాలకే పరిమితం కాకూడదని పేర్కొన్నారు. బీజేపీ కేవలం తాము రాష్ట్రంలో అధికారంలో లేమనే కారణంతో తెలంగాణను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా, కేంద్ర మంత్రివర్గంలో చోటు ఉన్నా.. సిరిసిల్ల నేతన్నల గోడును వినిపించడంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారని విమర్శలు చేశారు. బీజేపీ నాయకులు కేవలం ఓట్ల కోసమే తెలంగాణను వాడుకుంటున్నారు తప్ప, నిధుల సాధనలో చేతులెత్తేశారని ధ్వజమెత్తారు.
సానుకూల నిర్ణయం తీసుకోవాలి..
వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనైనా సిరిసిల్ల 'మెగా పవర్ లూమ్ క్లస్టర్'ను అధికారికంగా ప్రకటించి, ఈ పదేళ్ల అన్యాయానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తితో తెలంగాణ నేతన్నల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ కోరారు. కేంద్రం జాప్యం పెరిగే కొద్దీ నేతన్నలలో ఆవేదన ఆగ్రహంగా మారుతోందని, తక్షణమే కేంద్రమంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేటీఆర్ తన లేఖలో కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జన్వాడ భూముల కేసులో కోర్టు కీలక ఆదేశాలు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. బీజేపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక పరిణామం
Read Latest Telangana News And Telugu News