ED Investigation: జన్వాడ భూముల కేసు.. కోర్టు ఆదేశాలివే..
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:21 PM
సత్యం కంప్యూటర్ స్కామ్‌లో జన్వాడ భూములపై నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జన్వాడ ల్యాండ్ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులతో పాటు 213 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్, జనవరి19 (ఆంధ్రజ్యోతి): సత్యం కంప్యూటర్ స్కామ్‌లో(Satyam Computers Scam) జన్వాడ భూములపై నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జన్వాడ ల్యాండ్ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులతో పాటు 213 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
ఏంటీ జన్వాడ ల్యాండ్స్ వ్యవహారం..?
భారతదేశ ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసాల్లో ఒకటిగా పేరుగాంచిన సత్యం కంప్యూటర్స్ స్కామ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ స్కామ్‌కు సంబంధించిన జన్వాడ భూముల(Janwada Lands) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములు, ముఖ్యంగా జన్వాడ ప్రాంతంలోని ల్యాండ్స్, సత్యం స్కామ్‌లో భాగంగా అక్రమంగా కొనుగోలు చేశారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.
నిధుల మళ్లింపు..
సత్యం కంప్యూటర్స్ ద్వారా దారి మళ్లించిన నిధులను వినియోగించి ఈ భూములు కొనుగోలు చేశారని ఈడీ దర్యాప్తులో తేలింది. సీబీఐ గతంలో చేసిన విచారణలో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాల భూముల వివరాలు పూర్తిగా బయటపడలేదని ఈడీ అధికారులు తెలిపారు. జన్వాడ ల్యాండ్స్ వ్యవహారం రాజకీయ, వ్యాపార వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ భూముల కొనుగోలు పెద్ద సంచలనం సృష్టించింది.
ఈడీ కోర్టులో అభినవ్ పిటిషన్..
ఈ కేసులో తాజాగా.. అభినవ్ అనే వ్యక్తి కీలకంగా మారాడు. జన్వాడ భూముల వ్యవహారంపై తనకు తెలిసిన విషయాలను కోర్టు ముందు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ అభినవ్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాను ఈ స్కామ్‌లో జరిగిన అసలు విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ నేపథ్యంలో ఈ కేసును మరింత సమగ్రంగా తీసుకెళ్లే అవకాశముందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అభినవ్ వాంగ్మూలం కీలకం..
అభినవ్ వాంగ్మూలం కొత్త ఆధారాలను బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు తెలియని బినామీ లావాదేవీల వివరాలు, రాజకీయ, వ్యాపార సంబంధాల వంటి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆయనను సాక్షిగా అనుమతిస్తే, కేసు దిశ పూర్తిగా మారే అవకాశం ఉంది.
సత్యం రాజు కుటుంబానికి నోటీసులు..
జన్వాడ భూముల కేసును ఈడీ అధికారులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేస్తున్నారు. సత్యం రాజు(రామలింగ రాజు), నందిని రాజు, తేజ రాజుతో పాటు మొత్తం 213 మందికి నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ద్వారా అక్రమ ఆస్తుల వివరాలు, భూముల కొనుగోలు విధానం, నిధులు తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గతంలో సీబీఐ విచారణ..
సత్యం కంప్యూటర్స్ స్కామ్‌పై గతంలో సీబీఐ విస్తృతంగా విచారణ చేసింది. ఆ విచారణలో నిధుల దారి మళ్లింపు, తదితర అంశాలు బయటపడ్డాయి. అయితే.. అప్పట్లో భూముల కొనుగోలు అంశం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో వందల ఎకరాల భూములు ఈడీ విచారణలో అత్యంత కీలకంగా మారాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ భూముల విలువ ప్రస్తుతం.. వేల కోట్ల రూపాయలకు చేరినట్లు ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
2014లో ఈడీ మనీలాండరింగ్ కేసు..
ఈ అంశంపై 2014లో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సత్యం స్కామ్ ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయడం షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు నిర్వహించడం వంటి అంశాలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు అదే కేసులో భాగంగా జన్వాడ ల్యాండ్స్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇవి కూడా చదవండి...
ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. బీజేపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక పరిణామం
Read Latest Telangana News And Telugu News