Siddipet News: ఘోరం.. భార్య గొంతు కోసిన భర్త.. అడ్డొచ్చిన కూతురిపైనా..
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:59 PM
సిద్దిపేటలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసిన భర్త.. అడ్డుకోబోయిన కూతురుపైనా దాడి చేశాడు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సిద్దిపేట, జనవరి 19: సిద్దిపేట పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను అతికిరాతంగా హత్య చేశాడు భర్త. అడ్డుకోబోయిన కూతురి పట్ల కూడా దారుణంగా ప్రవర్తించాడు. ఈ దాడి అనంతరం.. అతడూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
సిద్దిపేటలోని ఆదర్శ్ నగర్‌లో ఎల్లయ్య, శ్రీలత అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి అర్చన(16) అనే కూతురు ఉంది. అయితే.. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. కత్తితో భార్య గొంతు కోసేశాడు. ఆమెపై విచాక్షణారహితంగా దాడి చేసేందుకు యత్నించిన తండ్రిని కూతురు అడ్డుకోబోయింది. దీంతో మరింత రెచ్చిపోయిన అతడు.. కూతురినీ రోకలి బండతో కొట్టాడు. భార్యాబిడ్డలపై దాడి అనంతరం.. భయంతో ఎల్లయ్య తన గొంతు కోసుకున్నాడు.
ఎల్లయ్య ఇంట్లో నుంచి కేకలు విన్న స్థానికులు అక్కడకు వచ్చి చూడగా రక్తపుమడుగులో ముగ్గురూ పడిఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురినీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే భార్య శ్రీలత(32) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం.. ఎల్లయ్య, అర్చనలు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్
మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులు
Read Latest Telangana News And Telugu News