Bandla Ganesh Padayatra: రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్
ABN , Publish Date - Jan 19 , 2026 | 10:03 AM
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన సినిమా థియేటర్ నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 19: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) 'సంకల్ప యాత్ర' పేరిట తిరుమలకు(Tirumala) పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన సినిమా థియేటర్ నుంచి సోమవారం ఉదయం ఈ యాత్ర ప్రారంభమైంది. సుమారు 460 - 500 కిలోమీటర్ల మేర గణేష్ యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమే అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై(CM Chandrababu) అభిమానంతో నడిచి వెళ్తున్నానని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆశీస్సులతో ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు.
తాను మెగాస్టార్‌ను చూద్దామని సినీ ఇండస్ట్రీకి వచ్చానని.. అలాంటి చిరంజీవి సినిమా తన థియేటర్‌లో ఆడుతుండగా సంకల్ప యాత్ర మొదలు పెట్టినట్లు బండ్ల గణేష్ చెప్పారు. నాడు చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని తెలిపారు. ఆయనకు బెయిల్ వస్తుందని, కోర్టు విచారణ ఉన్న ప్రతిసారీ సుప్రీంకోర్టులో ఉండేవాడినని గుర్తుచేశారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన ఎలాంటి మచ్చలేకుండా విడుదల కావాలని ఏడుకొండల వాడికి మొక్కుకున్నానన్నారు.
అనంతరం.. కేబీఆర్ పార్క్ వద్ద చంద్రబాబు కోసం మాట్లాడినట్లు గణేష్ చెప్పారు. ఐటీ వారందరితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. జైలు నుంచి చంద్రబాబు జూలు విదిల్చిన సింహంలా బయటకు వచ్చారని.. తమలో ఉత్సాహాన్ని నింపారన్నారు. అందుకే నేడు మొక్కు తీర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ యాత్ర తన ఒక్కడి అడుగు కాదని.. ప్రతి తెలుగువాడి అడుగని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గణేష్ యాత్ర విజయవంతం కావాలని నటుడు శివాజీ, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఆకాంక్షించారు.
కాగా.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బండ్ల గణేష్ తీవ్రంగా బాధపడిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు ఆ కేసు నుంచి ఆధార రహితంగా తేలి, జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ మొక్కు తీర్చుకుంటున్నారు. ఇది పూర్తిగా భక్తి భావంతో చేస్తున్న యాత్ర అని, రాజకీయ యాత్ర కాదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. అతివేగంగా ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు..
ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం
Read Latest Telangana News And Telugu News