Cabinet Approves Municipal Elections: మునిసిపల్ ఎన్నికలకు ఓకే
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:12 AM
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది...
వచ్చేనెల్లో నిర్వహణకు క్యాబినెట్ నిర్ణయం
మేడారంలో సమావేశం.. కీలక నిర్ణయాలు
2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు
మెట్రో రెండో దశ భూసేకరణకు పచ్చజెండా
2,787 కోట్లు కేటాయించాలని నిర్ణయం
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు హైలెవల్ బ్రిడ్జి
నిర్ణయాలను వెల్లడించిన పొంగులేటి
హైదరాబాద్/వరంగల్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ధనసరి సీతక్కతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 27వ మంత్రిమండలి సమావేశం సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్న మేడారంలో నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్లు, 2,996 వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయినందున.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా రెండు రోజుల క్రితం రిజర్వేషన్లు ఖరారు చేశామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న శివరాత్రి, ఆ మరుసటి రోజు రంజాన్ పండుగ, తదనంతరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నందున.. వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో.. వాటి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటినుంచే ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు కన్సల్టెన్సీని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15లోగా ఆ కన్సల్టెన్సీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, టెంపుల్ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.
దేవాదాయ, రెవెన్యూ, అటవీ పర్యాటక, పురాతత్వ శాఖలు సంయుక్తంగా సమగ్ర నివేదిక తయారు చేయాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లడించారు. మొత్తంగా మార్చి 31 నాటికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశించారన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో ఇంతవరకు జరిగిన పురోగతిపై క్యాబినెట్ క్షుణ్ణంగా చర్చించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించిందన్నారు. అలాగే మెట్రో ఫేజ్-2ఏ లోని నాలుగు కారిడార్లు, ఫేజ్-2బీలోని మూడు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈలోపు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రిమండలి నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.2,787 కోట్ల అంచనా వ్యయమయ్యే భూసేకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని చెప్పారు. దీంతోపాటు 14 ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూకేటాయింపులు చేశామని వెల్లడించారు. నల్లగొండలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మించే కార్పొరేట్ ఆఫీసుకు, పాలమూరులో కట్టే మరో కార్పొరేట్ ఆఫీసు నిర్మాణానికి సంబంధించి భూకేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు ఒకచోట 20 కుంటలు, మరోచోట 17 కుంటలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. ఇక హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలె్‌పమెంట్ కోసం టీజీఐఐసీకి 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపామన్నారు. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు ప్రాంతంలో కొత్తగా హైలెవల్ బ్రిడ్జి ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని అన్నారు.
కుంభమేళాను తలపించేలా మేడారం జాతర..
మేడారం దేవాలయ అభివృద్ధికి సుమారు 19 ఎకరాలు కేటాయించామని, మరో 21 ఎకరాలను సేకరించబోతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తులో మేడారాన్ని తిరుపతి, కుంభమేళాను తలపించేలా చేస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో లా కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో మరో 28 కొత్త పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టుకు కూడా ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే రాబోయే రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మట్టిరోడ్లు కనిపించవన్నారు. హ్యామ్ రోడ్లకు సంబంధించి దాదాపు 6వేల కిలోమీటర్ల పనులను వేగవంతం చేయాలని, ఆర్‌అండ్‌బీ ద్వారా త్వరగా పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్టు చేసి, ములుగు జిల్లాలోని ఐదు గ్రామాలు, 30 చెరువులు, కుంటలను నింపడంతోపాటు 7500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు. రూ.143 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించ తలపెట్టినట్లు తెలిపారు. అలాగే జంపన్నవాగులో నిరంతరం నీరు ప్రవహించేలా రామప్ప చెరువు నుంచి పైప్‌లైన్ వేస్తామని సీఎం ప్రకటించం సంతోషకరమన్నారు.
హైదరాబాద్ అవతల తొలిసారిగా క్యాబినెట్ భేటీ
నేడు ఉదయం గద్దెల ప్రాంగణం ప్రారంభం
కుటుంబ సమేతంగా వనదేవతలకు మొక్కులు చెల్లించుకోనున్న రేవంత్
మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో నిర్వహించారు. ఈ భేటీ కోసం హరిత హోటల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, వివేక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు విదేశీ పర్యటనలో ఉండటంతో, దామోదర రాజనర్సింహ ఇతర కారణాలతో హాజరుకాలేకపోయారు. సీఎం రేవంత్, మంత్రులు ఆదివారం రాత్రి మేడారం హరిత హోటల్‌లోనే బస చేశారు. సోమవారం ఉదయం సీఎం కుటుంబ సమేతంగా వన దేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లిస్తారు. పునర్నిర్మించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మేడారం రావడం, భక్తుల రాక పెరిగిన నేపథ్యంలో 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Deputy Chief Minister Bhatti Vikramarka: నైనీ టెండర్లు రద్దు
CM Revanth Reddy Vows to Defeat TRS: టీడీపీని దెబ్బతీసిన బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి!