Share News

Deputy Chief Minister Bhatti Vikramarka: నైనీ టెండర్లు రద్దు

ABN , Publish Date - Jan 19 , 2026 | 05:04 AM

ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు..

Deputy Chief Minister Bhatti Vikramarka: నైనీ టెండర్లు రద్దు

  • సింగరేణి అధికారులకు ఆదేశాలిచ్చాను

  • నిబంధనలు విధించింది సింగరేణి బోర్డే

  • ఇందులో ప్రభుత్వానికి సంబంధంలేదు

  • నీచ రాజకీయాలకు దిగజారేవాణ్ని కాదు

  • కట్టుకథలు ప్రసారం చేస్తే ఊరుకోం

  • ‘ఆంధ్రజ్యోతి’లో ఏ ఉద్దేశంతో కథనం రాశారో తెలియదు

  • గతంలో వైఎస్‌కు సన్నిహితుడిననేమో

  • మీడియాతో ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే బొగ్గు గని కోసం టెండర్లు పిలిచిందీ, టెండర్‌ నిబంధనలు విధించిందీ.. సింగరేణి పాలక మండలి మాత్రమేనని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దేశంలోని ఇతర ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గు బ్లాకుల కోసం ఏ నిబంధనలు విధించాయో అధ్యయనం చేసి.. తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం ‘బొగ్గు కోసం నీచ కథనం’ శీర్షికతో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన వ్యాసంపై భట్టి స్పందించారు. ఈ మేరకు ప్రజాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్లు పిలిచింది సింగరేణి సంస్థ, బోర్డు మాత్రమే. ఈ మాత్రం జ్ఞానం లేకుండా తోచింది రాయడం సరికాదు. టెండర్‌లో సైట్‌ విజిట్‌ నిబంధన పెట్టారని రాశారు. ఆ ప్రాంతం క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నందున.. స్థలాన్ని పరిశీలించి టెండర్లు వేయాలనేది నిబంధన. చాలా సంస్థల్లో ఈ నిబంధనలున్నాయి’’ అని భట్టివిక్రమార్క అన్నారు. తాను వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికో, అధికార హోదాను అనుభవించడానికో రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేయడానికి, సమాజంలో మార్పు తేవాలన్న ప్రత్యేక లక్ష్యంతో వచ్చానని తెలిపారు. దారిదోపిడీదారులు, బందిపోట్ల నుంచి తెలంగాణ ఆస్తులు, వనరులను రక్షించి.. వాటిని ప్రజలకు అందజేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. నీచ, నికృష్టపు రాజకీయాల కోసం దిగజారిపోయే వీక్‌ క్యారెక్టర్‌ తనది కాదన్నారు.


తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికే..

కట్టుకథ, పిట్టకథను అల్లి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి కథనం రాశారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు. ఎవరైనా నిజాయితీగా ఉండటమే కాదని, నిజాయితీగా కనిపించాలని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే కొన్ని వార్తా కథనాలు వడ్డిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతిలో కథనం రాశారు. అందులో నా పేరు కూడా పెట్టారు. సింగరేణి కాలరీస్‌ ఆస్తులు, బొగ్గు గనులు తెలంగాణ ప్రజల ఆత్మ. ఆ ఆస్తులను, ఆత్మను కాపాడి.. భవిష్యత్తు తరాలకు అందించడమే నా లక్ష్యం. రాధాకృష్ణ లాగా ఏదిపడితే అది రాయను.. మాట్లాడను’’ అని భట్టివిక్రమార్క అన్నారు. తాను ప్రత్యేక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, దారిదోపిడీగాళ్లు, గద్దల్లాంటివారు సమాజం మీదపడి. పీక్కుతింటుంటే.. ఆ దోపిడీ నుంచి ప్రజలను రక్షించడానికి వచ్చానని తెలిపారు. తన జీవితం ఎల్లప్పుడూ పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. కథనం రాసినవారికి ఎవరిమీదనో ప్రేమ ఉండొచ్చునన్నారు. గతంలో తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా ఉండేవాడినని, అందుకు ఆయనపై కోపంతో తన మీద కథనం రాశారని ఆరోపించారు.

కథనాలు అల్లి ప్రసారం చేస్తే ఊరుకోం..

రాధాకృష్ణ రాసిన కథనం ఉద్దేశం ఏదైనా.. బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నైనీ టెండర్లను రద్దు చేయాలని సింగరేణి సంస్థను ఆదేశించానని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇతర విషయాలను తాను, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తేల్చుకుంటామని, ఆయన ఏ ఉద్దేశంతో కథనం రాశారో తెలుసుకొని తరువాత చెబుతానని అన్నారు. ‘‘మీ మధ్య వైరాన్ని మీరిద్దరే తేల్చుకోవాలి. మీ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని, పాలనను, మంత్రులను, అధికారులను లాగుతామంటే చూస్తూ ఊరుకోం. ఏ చానల్‌ కూడా కథనాలు అల్లి.. ప్రసారం చేస్తామంటే (మంత్రి, ఐఏఎ్‌సపై ఎన్‌టీవీ ప్రసారం చేసిన కథనాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) ఊరుకోం. ముఖ్యమంత్రి, మంత్రులం రాష్ట్ర ప్రయోజనాల కోసం విస్తృతంగా పనిచేస్తున్నాం. చిల్లర కథనాలకు భయపడే వారెవరూ లేరు’’ అని భట్టివిక్రమార్క అన్నారు. తాను ఈ బాధ్యతల్లో ఉన్నంతకాలం దోపిడీదారులను, వ్యవస్థీకృతమైన క్రిమినల్స్‌ను తెలంగాణ ఆస్తులపై, వ్యవస్థలపై పడకుండా అడ్డుకుంటానన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 05:04 AM