CM Revanth Reddy Vows to Defeat TRS: టీడీపీని దెబ్బతీసిన బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి!
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:09 AM
ఎన్టీఆర్, వైఎస్సార్‌లను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్షకట్టి, నాయకత్వాన్ని దెబ్బకొట్టిన కేసీఆర్
బీఆర్‌ఎస్‌ను 100 మీటర్ల గొయ్యిలో పాతిపెట్టాలి
ఊర్లలో ఆ పార్టీ దిమ్మెలు కూలాలి
అదే ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి అవుతుంది
ఎన్టీఆర్, వైఎస్సార్ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం
అందుకు మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు
మునిసిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలి
2034 వరకూ అధికారంలో ఉంటాం
ఖమ్మం జిల్లా మద్దులపల్లి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
కమ్యూనిస్టుల పోరాటాలే.. కాంగ్రెస్ సర్కారు చట్టాలు
వారి సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
బీజేపీతో దేశానికి ప్రమాదం.. సీపీఐ శతాబ్ది ఉత్సవ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కొత్తగూడెం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్, వైఎస్సార్‌లను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అందుకు సహచర మంత్రులు తనకు సహకరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా, వారి కుటుంబాలు వేరే పార్టీలో ఉన్నా.. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు అని సగర్వంగా చెబుతున్నానని రేవంత్ పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చడానికి అప్పట్లో ఆయన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అలాగే రైతులు, పేదల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో పాటుపడ్డారన్నారు. సంక్షేమ పథకాల అమలులో వీరిద్దరి పేర్లు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన ఖమ్మం రూరల్ మండలంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, శ్రీహరితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ.. పేదవాడి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
అదే నందమూరి తారకరామారావుకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్‌కు అభిమానులు, నారా చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి.. ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖర్‌రావును, బీఆర్‌ఎ్‌సను సమూలంగా వందమీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలని, ఊర్లలో బీఆర్‌ఎస్ దిమ్మెలు కూలాలని పేర్కొన్నారు. అప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని సీఎం చెప్పారు. బీఆర్‌ఎ్‌సను బొంద పెట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్టీఆర్ వర్థంతి (జనవరి 18) విషాదకరమైన రోజని సీఎం రేవంత్ చెప్పారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలి, వారి కళ్లలో ఆనందం చూడాలని రెండు రూపాయలకే కిలోబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఎన్టీఆర్.. పేదలకు తెల్ల అన్నం తినే అవకాశం కల్పించారని తెలిపారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని.. నేడు ఇంకా వినూత్నంగా పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో 3.15 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రావాలంటే ఉన్నోళ్లు ఎవరైనా చనిపోవాలన్న పరిస్థితి ఉండేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికీరేషన్ కార్డు అందేలా చూస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరైనా రేషన్ కార్డు రాని పేదవారు ఉంటే కార్డు ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. ఇక 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే తొలి సంతకాన్ని రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే ఫైలుపై పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని రేవంత్ అన్నారు. నాడు ఏడు గంటల ఉచిత కరెంటుతో ప్రారంభమైన పథకం నేడు పేదలు, రైతులకు అవసరమైన 30 లక్షల పంపుసెట్లకు 24 గంటలూ ఉచిత విద్యుత్తు అందిచే స్థాయికి చేరిందని చెప్పారు.
అలాగే 55 లక్షల పేదల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చిన పదేళ్లలో కేసీఆర్ డబుల్‌బెడ్‌రూం అని ఊరించాడని, ఎవరికైనా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు వచ్చాయా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించి.. మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పేదవాళ్ల కళ్లలో ఆనందం చూడడానికి 4.50 లక్షల ఇళ్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని తెలిపారు. పదేళ్లు చంద్రశేఖర్‌రావు చేతికి రూ.20 లక్షల కోట్లు వచ్చాయని.. అవి ఎక్కడికి పోయాయో తెలియదని చెప్పారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రెండు లక్షల ఇళ్లు కట్టి ఉన్నా పదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పేదవాళ్లకు దక్కేవని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి పేదవాడికీ ఇల్లు మంజూరు చేసి ఆత్మగౌరవంతో బతికేలా పథకం కొనసాగిస్తోందన్నారు. ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీఆర్‌ఎస్ నేతలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నాడు మాయలేడి రూపంలో నేడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారన్నారు.
2034 వరకు అధికారం కాంగ్రె్‌సదే..
1994 నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉందని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందని, 2014-2023 వరకు బీఆర్‌ఎస్ ఉందని.. 2023 నుంచి 2034 వరకు కాంగ్రెసే అధికారంలో ఉంటుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సుపరిపాలన అందుతోందని, 70 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రూ.350 కోట్లు వెచ్చించి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని వివరించారు. రూ.27 వేల కోట్లు సున్నా వడ్డీ కింద రుణాలు ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. 40 ఏళ్ల నుంచి రావణకాష్ఠంలా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనగణన, కులగణన చేసి.. ఆ దామాషా ప్రకారమే రాజకీయ అవకాశాలు, నిధుల కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు. రెండేళ్లలో ఎన్నో విజయాలు సాధించామని, సామాజిక సమస్యలు పరిష్కరించామని, సంక్షేమ పథకాలు అమలు చేశామని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించడానికి భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మించుకుంటున్నామని వివరించారు.
అదృష్టం కలిసొచ్చింది.. అయినా అందరి సహకారంతో..
‘రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకోవాలి’ అని రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరికి బీఫాం ఇస్తే వారి గెలుపుకోసం పనిచేయాలని సూచించారు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అవి బేదాభిప్రాయాలుగా మారకూడదని అన్నారు. ‘‘కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది. కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది. నాకు అదృష్టం కలిసొచ్చింది. నా కంటే అనుభవజ్ఞులు ఉన్నా.. ఏ మంత్రి పదవీ చేపట్టకుండానే రాజకీయ జీవితంలో 18వ ఏట అడుగుపెట్టే సమయానికే ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం దక్కింది. కష్టాన్ని నమ్ముకుని, క్రమశిక్షణతో పని చేస్తే పార్టీ పెద్దలు నాకు సీఎంగా అవకాశం ఇచ్చారు. సీనియర్లు ఉన్నా, ప్రభుత్వాన్ని నడపడంలో అందరూ నాకు పూర్తిగా సహకరించారు. దిగ్విజయంగా రెండేళ్లు పాలన సాగించాం. మునిసిపల్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో నూటికి నూరుశాతం కాంగ్రెస్ జెండా ఎగరాలి. బీఆర్‌ఎ్‌సను బొందపెట్టాలి. బీజేపీ ఆనవాళ్లు కూడా ఖమ్మం జిల్లాలో లేవు. గత ప్రభుత్వం భద్రాచలం ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వడంతో భూ సేకరణ కూడా పూర్తయింది. త్వరలోనే భద్రాచలం ఆలయాన్ని అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా నిర్మాణం చేసుకుందాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.