Kavitha Meets Prashant Kishore: కవితతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు..
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:14 AM
బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సొంత అస్తిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే తలంపుతో ఉన్నారు.
హైదరాబాద్, జనవరి 19: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. సొంత పార్టీని స్థాపించడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని ఆమె నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌తో కవిత వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 60 రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ వచ్చి.. కవితతో భేటీ అయినట్లు సమాచారం.
సంక్రాంతి పండగ వేళ.. హైదరాబాద్‌లో కవిత, పీకేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు.. తమ పార్టీని ప్రజలు ఓన్ చేసుకోవడం.. ప్రజల కోణంలో ఎలా పనిచేయాలనే అంశంతో పాటు వివిధ అంశాలపై ప్రశాంత్ కిశోర్‌తో కవిత సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇక పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో కవిత అధ్యయనం చేయిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో కవిత వేగం పెంచిన విషయం విదితమే.
ఎంపీగా గెలిచి..
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత క్రియాశీలక పాత్ర పోషించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అదే సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కవిత గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే.. 2019లో అదే స్థానం నుంచి మళ్లీ బరిలో దిగి.. బీజేపీ అభ్యర్థి ధర్మపూరి అర్వింద్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.
బీఆర్ఎస్ తరఫున కవితను శాసనమండలికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ పంపారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత ప్రజల్లోకి వెళ్లారు. జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ఆమె నిలదీస్తున్న విషయం విదితమే. సొంత పార్టీ స్థాపించడం ద్వారా.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ పార్టీలకు బలమైన పోటీగా నిలవాలని కవిత భావిస్తున్నారు. అందుకోసం ఆ దిశగా అడుగులు వేస్తున్నారామె. ఈ నేపథ్యంలో ఇలా ప్రశాంత్ కిశోర్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అప్పట్లో ప్రశాంత్ కిశోర్‌తో కేసీఆర్ పలుమార్లు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు దీరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీపంచమి వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జస్ట్ చిన్న కండిషన్
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ
For more TG News And Telugu News