Share News

Indrakeeladri: శ్రీపంచమి వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జస్ట్ చిన్న కండిషన్

ABN , Publish Date - Jan 19 , 2026 | 10:14 AM

శ్రీపంచమి పర్వదినం వేళ.. బెజవాడ దుర్గమ్మ తల్లి సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆలయ ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.

Indrakeeladri: శ్రీపంచమి వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జస్ట్ చిన్న కండిషన్
Indrakeeladri Temple

విజయవాడ, జనవరి 19: పర్వదినాల మాసం.. మాఘమాసం. జనవరి 23న మాఘ శుద్ధ పంచమి. ఈ శ్రీ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు భక్తులకు శ్రీ దుర్గమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. దీంతో ప్రధాన ఆలయంలో అమ్మవారి మూల స్వరూపానికి ప్రత్యేక అలంకరణతో పాటు, మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక.. ఆరో అంతస్తులో దాదాపు 500 మంది విద్యార్థులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు.


అలాగే.. యాగశాలలో శ్రీ సరస్వతీ హోమం సహా పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ పంచమి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సరస్వతీ దేవి రూపంలో అమ్మవారిని విద్యార్థులు ఉచిత దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం విద్యార్థులకు పెన్ను, శక్తి కంకణం, అమ్మవారి ఫొటోతో పాటు 40 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తామని దేవస్థానం ఉన్నతాధికారులు వెల్లడించారు.


శుక్రవారం వచ్చే ఈ వసంత పంచమి రోజున.. స్కూల్ యూనిఫామ్ ధరించి, గుర్తింపు కార్డుతో వచ్చే విద్యార్థులకే ఉచిత దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు వివరించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.


శ్రీ పంచమి వేళ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో అమ్మవారు సరస్వతీ రూపంలో దర్శనమివ్వనున్నారు. ఇక బాసర(నిర్మల్ జిల్లా), వర్గల్(సిద్ధిపేట జిల్లా) దేవాలయాలకు సైతం భక్తులు పోటెత్తనున్నారు. మరోవైపు.. నేటి నుంచి అంటే సోమవారం నుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభమయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు

For more AP News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 12:23 PM