Road Accidents In AP: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 09:39 AM
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అమరావతి, జనవరి 19: సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయి. స్వస్థలాలకు వెళ్లిన వారు తమ తమ ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారులో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. 108కి సమాచారం అందించారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 24 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.
బస్సులో పొగలు..
కాకినాడ జిల్లాలోని జగ్గంపేట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులంతా భయంతో బస్సు దిగి పరుగులు తీశారు. బస్ డ్రైవర్లు వెంటనే అప్రమత్తమై సమస్యను గుర్తించి సరిచేశారు. అనంతరం.. బస్సు హైదరాబాద్‌కు బయలుదేరింది. ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగానే.. ఈ పొగలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
నెల్లూరులోనూ..
నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలం బసినేనిపల్లి జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో బెడుసుపల్లి కాశినాయన ఆశ్రమానికి వీరంతా వెళ్లారు. స్వస్థలం ఉదయగిరికి తిరిగొచ్చే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ
అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..
For more AP News And Telugu News