MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ
ABN , Publish Date - Jan 19 , 2026 | 09:04 AM
లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 23వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది.
అమరావతి, జనవరి 19: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 23న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఎంపీ మిథున్ రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. ఈ లిక్కర్ స్కామ్‌లో ఆయన కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో హవాలా, మనీ ల్యాండరింగ్ రూపంలో భారీఎత్తున అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్టయ్యారు. అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలైన విషయం విదితమే.
మరోవైపు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సైతం రెండ్రోజుల క్రితం ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 22వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వైసీపీ పభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై జరిగిన విచారణలో ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి ఆస్తులను సైతం ప్రభుత్వానికి అటాచ్ చేశారు. అలాగే ఈ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం వారు బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ స్కామ్‌లో తవ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా.. ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో కీలక పాత్ర పోషించారనే ప్రచారం సాగుతోంది. దాంతో విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ ముందు రోజే విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే వైసీపీతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో ఏనుగులు హల్‌చల్.. అప్రమత్తమైన అటవీ సిబ్బంది
అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..
For more AP News And Telugu News