Nagoba Jatara: అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..
ABN , Publish Date - Jan 19 , 2026 | 07:25 AM
ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్, జనవరి 19: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు.. నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
ఆసియాలోనే..
నాగోబా జాతర.. ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గాంచింది. పుష్యమాసంలో నెలవంక కనిపించిన అనంతరం మెస్రం వంశీయులు.. ఈ నాగోబా జాతరకు శ్రీకారం చుడతారు. డిసెంబర్ 30న మెస్రం వంశీయులు కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా హస్తినమడుగుకు చేరుకొని.. అక్కడ సేకరించిన పవిత్ర గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్నారు. ఆ గంగాజలంతో ఆదివారం అర్ధరాత్రి ఆదిశేషుడికి అభిషేకం చేసి మహాపూజలు నిర్వహించడం ద్వారా ఈ జాతరను ప్రారంభించారు.
23 వరకు జాతర..
నాగోబా మహాపూజతో ఆదివారం ప్రారంభమైన జాతర.. ఈనెల 23వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ జాతరలో భాగంగా 20న పెర్సపేన్, బాన్ పేన్ పూజలు, 22న నాగోబా దర్బార్ నిర్వహించనున్నారు. 23న బేతాల్ పూజ, మండగాజాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగియనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకండా సరిహద్దు రాష్ట్రాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు భారీగా తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. అతివేగంగా ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు..
75 దేశాలకు వీసా ప్రక్రియను నిలిపివేసిన అమెరికా
For more TG News And Telugu News