Share News

Renu Desai: కుక్కల్ని చంపడం దారుణం: రేణూ దేశాయ్

ABN , Publish Date - Jan 19 , 2026 | 06:31 PM

వీధి కుక్కలను చంపడంపై ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల పేరుతో వాటిని హతమార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు..

Renu Desai: కుక్కల్ని చంపడం దారుణం: రేణూ దేశాయ్
Renu Desai

హైదరాబాద్, జనవరి19 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కలను (Street Dogs) చంపడంపై ప్రముఖ సినీనటి రేణూదేశాయ్ (Renu Desai) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల పేరుతో వాటిని హతమార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ భూమిపై ప్రతి జీవికీ జీవించే హక్కు ఉందని స్పష్టం చేస్తూ, కుక్కలను చంపడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.


వారికి పిచ్చి పట్టింది..

వీధి కుక్కలపై ద్వేషంతో మాట్లాడుతున్న కొందరిపై రేణూ దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్కలను వ్యతిరేకిస్తున్నవారికి పిచ్చి పట్టిందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల దాడులపై వస్తున్న విమర్శలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ‘100 కుక్కల్లో ఐదు కుక్కలు కరిస్తే మిగతా అన్నింటినీ చంపేయాలా?’ అంటూ ప్రశ్నించారు. సమస్యకు పరిష్కారం హింస కాదని, సరైన నిర్వహణ, వ్యాక్సినేషన్ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

వారివే ప్రాణాలా?

ఈ సందర్భంగా రేణూ దేశాయ్ మరింత భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేవలం కుక్కల వల్ల మృతి చెందినవారివే ప్రాణాలా?’ అంటూ ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాల్లో, దోమల వల్ల వచ్చే వ్యాధులతో చనిపోయిన వారి ప్రాణాలకు విలువ లేదా? అని ప్రశ్నిస్తూ, సమస్యలను సమగ్రంగా చూడాలని సూచించారు. వీధి కుక్కల హత్యలను ఖండిస్తూ.. ‘ఈ భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది’ అని స్పష్టం చేశారు. మనుషుల నిర్లక్ష్యం వల్లే చాలా సమస్యలు తలెత్తుతున్నాయని, జంతువులపై నింద వేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. కుక్కలను చంపడం దారుణమని, ఇది మానవత్వానికి మచ్చ అంటూ వ్యాఖ్యానించారు. చట్టపరంగా కూడా జంతువులను హతమార్చడం నేరమని గుర్తు చేశారు.


మీడియా ప్రతినిధుల సంభాషణపై క్లారిటీ

ఈ అంశంపై మాట్లాడుతున్న సమయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన వాగ్వాదంపై కూడా రేణూదేశాయ్ స్పందించారు. ‘ఓ వ్యక్తి నన్ను ఉద్దేశించి మాట్లాడారని.. అందుకే ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వచ్చింది’ అని స్పష్టం చేశారు. తాను ఎవరినీ అనవసరంగా అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు.

నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు..

ఈ వివాదాన్ని రాజకీయ రంగుకు ముడిపెట్టడంపై రేణూదేశాయ్ అసహనం వ్యక్తం చేశారు. ‘నాకు పాలిటిక్స్ ఇష్టం లేదని... నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు. నా వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడొద్దు. అలానే నా వ్యక్తిగత జీవితాన్ని ఈ అంశానికి ముడిపెట్టకండి. నా పిల్లలను ఇందులోకి లాగొద్దు’ అంటూ మీడియాకు రేణూదేశాయ్ విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జన్వాడ భూముల కేసు.. కోర్టు ఆదేశాలివే..

తెలంగాణ నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 07:09 PM