Hyderabad Police: సైబర్ బాధితులకు భరోసా.. పోలీసుల వినూత్న కార్యక్రమం
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:58 PM
సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, బాధితులకు భరోసా కల్పించే విధంగా సీ-మిత్ర కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు.టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవీయ దృక్పథాన్ని మేళవించి రూపొందించిన ఈ కార్యక్రమం ప్రజలకు భరోసాగా నిలుస్తోంది.
హైదరాబాద్, జనవరి19 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల బాధితులకు భరోసా కల్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) మరో కీలక ముందడుగు వేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ఫిర్యాదు చేసేలా రూపొందించిన వినూత్న కార్యక్రమమే 'సీ-మిత్ర' (C-Mitra). ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
10 రోజుల్లోనే 1000 మందికి ఫోన్ కాల్స్..
జనవరి 9వ తేదీన సీ-మిత్ర కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. ఇది అమల్లోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే దాదాపు 1000 మంది సైబర్ బాధితులకు ఫోన్ కాల్స్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. రోజుకు సగటున 100 మంది బాధితులతో వర్చువల్‌గా పోలీసులు సంభాషిస్తున్నారని పేర్కొన్నారు.
వర్చువల్ పోలీసుల సేవలు
సీ-మిత్రలో ప్రత్యేకంగా నియమించిన వర్చువల్ పోలీస్ బృందం, సైబర్ బాధితులతో నేరుగా మాట్లాడుడుతున్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. నేరం ఎలా జరిగిందో తెలుసుకోవడం, అవసరమైన వివరాలు సేకరించడం, ఫిర్యాదు ఎలా చేయాలో మార్గనిర్దేశం చేయడం వంటి సేవలు అందిస్తున్నామని అన్నారు. దీంతో బాధితుల్లో భయం తగ్గి, పోలీసులపై నమ్మకం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. సీ-మిత్ర కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 200కి పైగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌లు సిద్ధం చేశామని పోలీసులు వెల్లడించారు. బాధితుల సమాచారం ఆధారంగా ఆటోమేటిక్‌గా కంప్లైంట్ ముసాయిదా తయారు చేసినట్లు తెలిపారు. ఈ డ్రాఫ్ట్‌లు బాధితులకు పంపించి, వారు సంతకం చేసిన తర్వాత తదుపరి చర్యలు చేపడుతున్నామనిపేర్కొన్నారు.
100కి పైగా ఎఫ్ఐఆర్‌ల నమోదు
ఇప్పటివరకు 100కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. సైబర్ నేరాలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారమని, ఇది సీ-మిత్ర కార్యక్రమం విజయానికి నిదర్శనంగా అధికారులు పేర్కొంటున్నారు. సీ-మిత్రలో మరో కీలక అంశం ఏమిటంటే.. బాధితులు 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేస్తే, వెంటనే సీ-మిత్ర బృందం స్పందిస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత, దాని కాపీని నేరుగా బాధితుల మొబైల్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. దీంతో పారదర్శకత పెరిగి, బాధితులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
పోస్టు లేదా కొరియర్ ద్వారా ఫిర్యాదు
డిజిటల్ సదుపాయాలు లేని బాధితుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో సంతకం చేసిన ఫిర్యాదు పత్రాలను పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపే వెసులుబాటు కల్పించారు. సీ-మిత్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు 24 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రెండు షిఫ్ట్‌ల్లోసేవలు అందిస్తున్నారు. బాధితుల కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వర్చువల్ హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉంది. ఈ సమయంలో సైబర్ నేరాలకు సంబంధించిన అన్ని సందేహాలకు సీ-మిత్ర బృందం సమాధానాలు ఇస్తోంది.సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి భయపడే వారు చాలా మంది ఉంటారు. అయితే సీ-మిత్ర కార్యక్రమం ద్వారా బాధితుల్లో భరోసా, పోలీసులపై నమ్మకం, ఫిర్యాదు చేయాలనే ధైర్యం పెరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
జన్వాడ భూముల కేసు.. కోర్టు ఆదేశాలివే..
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. బీజేపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక పరిణామం
Read Latest Telangana News And Telugu News