తెలంగాణ గౌరవాన్ని వీధుల్లోకి లాగుతారా.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
ABN , Publish Date - May 25 , 2026 | 10:36 AM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోయిందని ఆరోపించారు. ఒక మృతదేహాన్ని కుటుంబ సభ్యులే భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బతికి ఉన్నప్పుడు సహాయం లేకపోయినా, మరణానంతరం కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితికి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్లిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఓ పోస్టు పెట్టారు.
ప్రచారం కోసం కోట్ల రూపాయలు..
పేదల అంతిమయాత్ర కూడా గౌరవప్రదంగా సాగాలని కేసీఆర్ హయాంలో భావించి, మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశాయమని కేటీఆర్ గుర్తుచేశారు. అదే మానవత్వం, అదే ప్రజల గౌరవాన్ని కాపాడే పాలన అని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసోందని.. ప్రజలకు అవసరమైన కనీస వసతులను అందించడంలో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. పోస్టర్లు, సభలు, పర్యటనలు, హెలికాఫ్టర్ల కోసం ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారని, కానీ పేదలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆగ్రహించారు. రాజకీయ కక్షసాధింపులు, విమర్శలు, ప్రచార హోరులోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమగ్నమైందని విమర్శించారు. ప్రజల కష్టాలు, సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది..
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో పాలన సాగిందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన మార్పు ఇదేనా..? అని ప్రశ్నించారు. తెలంగాణ గౌరవాన్ని వీధుల్లోకి లాగడానికే ప్రజలు ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారా..? అని నిలదీశారు. నాయకుల పాదయాత్రలకు విలాసవంతమైన బస్సులు, ప్రచారాలకు ప్రభుత్వ వనరులు ఉపయోగించే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, పేదల అంతిమయాత్రకు కనీస గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ ఘటన కేవలం ఒక కుటుంబం విషాదం మాత్రమే కాదని, తెలంగాణ సమాజాన్ని కుదిపేస్తున్న పరిస్థితికి నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
అసలు ఏం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ కుటుంబం తమ బంధువు మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన కండె వెంకన్న (42) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు వెంకన్న అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు వాహనం ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆస్పత్రి అధికారులు మార్చురీ వ్యాన్ ఏర్పాటు చేయాలని పలుమార్లు వేడుకున్నారు. రెండు గంటల పాటు ఎదురుచూసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చివరకు చేసేదేమీ లేక కండె వెంకన్న మృతదేహాన్ని బంధువులే భుజాలపై మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడటం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించి కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..
Read Latest Telangana News And AP News And International News And Telugu News