Share News

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:19 PM

నీటి వాటాల పంపకాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వచ్చే 3 నెలలకు 30 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Krishna River Management Board Meeting

హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నీటి వాటాల పంపకాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వచ్చే మూడు నెలలకు 30 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. నాగార్జునసాగర్‌ నుంచి 9 టీఎంసీలు, కృష్ణా డెల్టా నుంచి 10 టీఎంసీలు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కోరింది. ఈ క్రమంలో ఏపీ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. ఈరోజు (సోమవారం) హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు హాజరయ్యారు. నాగార్జునసాగర్‌లో నీటి వాటాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.


దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్గంగా ఈ సమావేశం సాగింది. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కేఆర్ఎంబీ ( KRMB) భేటీ ముగిసింది. 9టీఎంసీలకు అదనంగా KDS నుంచి మరో 10 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ కోరింది. ఏపీ అదనపు డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఎటు తేలకుండానే కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ మీటింగ్ పెట్టాలని తొలుత తెలంగాణ సర్కార్ కోరింది. పల్నాడు పవర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీలో తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. పల్నాడు ప్రాజెక్టు సమాచారం పేపరులో చూసిన తర్వాతే తెలిసిందని ఏపీ అధికారులు తెలిపారు. జల్ జీవన్ మిషన్‌లో ఆ ప్రాజెక్టు చేపట్టినట్లు ఏపీ అధికారులు వివరించారు.


సాగర్ నుంచి నెలకు 5 టీఎంసీలు అడిగాం: తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు

నాగార్జున సాగర్ నుంచి నెలకు 5 టీఎంసీలు వచ్చే మూడు నెలల పాటు కావాలని ఏపీని అడిగామని తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు తెలిపారు. సాగర్‌లో 25 టీఎంసీల్లో రైట్ - లెఫ్ట్ కెనాల్ పంపకాలను మాత్రమే అడగాలని అన్నారు. సాగర్‌లో 40 టీఎంసీలు ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో తాగునీటికి 15 టీఎంసీలు పోతే మిగిలేది 25 టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. అందులో 10 టీఎంసీలను ఏపీ అదనంగా అడిగిందని చెప్పారు. ఆ రాష్ట్రానికి తాగునీరు అవసరం లేకపోయినా వితండ వాదం చేస్తోందని అన్నారు.


KDSలో ఒక్క నీటి చుక్క కూడా ఇచ్చేదిలేదు..

నాగార్జున సాగర్ రైట్ - లెఫ్ట్ నుంచి తాగునీటికి మాత్రమే ఈ నీటిని వాడాలని ఈఎన్సీ రమేశ్ బాబు సూచించారు. సాగర్‌లో తెలంగాణకు 281 టీఎంసీల అలకేషన్‌లో ఇప్పటి వరకు 65 టీఎంసీలు మాత్రమే వినియోగించామని వెల్లడించారు. ఏపీకి 152 టీఎంసీల అలకేషన్ ఉంటే.. 103 టీఎంసీలను వాడిందని ప్రస్తావించారు. KDSలో ఒక్క చుక్క నీటిని కూడా ఏపీ అడగవద్దని తెలిపారు. ఆ రాష్ట్రంలో వర్షాలు కురిశాయని, KDSలో ఒక్క నీటి చుక్క కూడా ఇచ్చేదిలేదని ఏపీకి తేల్చి చెప్పామని అన్నారు.


నాగార్జున సాగర్ నీటి విడుదలపై విజ్ఞప్తి చేశాం: ఏపీ ఈఎన్సీ నరసింహ మూర్తి

కేఆర్ఎంబీ బోర్డు సమావేశంలో నాగార్జున సాగర్ నీటి విడుదలపై తాము విజ్ఞప్తి చేశామని ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నరసింహ మూర్తి తెలిపారు. పదిరోజుల క్రితమే పలు లేఖల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరామని అన్నారు. సాగర్ కుడి కాలువ ద్వారా 8 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా ఒక టీఎంసీ నీటిని అడిగామని చెప్పారు. కృష్ణా డెల్టా సిస్టమ్ KDS అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని తాము కోరామని అన్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదలకు బోర్డు అంగీకారం తెలిపిందని చెప్పారు. కృష్ణా డెల్టా KDSకు నీటి కేటాయింపుల విషయంలో బోర్డు అంగీకరించలేదని అన్నారు. ఈ ఏడాది కృష్ణా డెల్టా KDSకు నీటిని విడుదల చేయలేదని బోర్డు దృష్టికి తాము తీసుకెళ్లామని తెలిపారు. కేడీఎస్ అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఈ సమావేశంలో గట్టిగా డిమాండ్ చేశామని అన్నారు. నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వంతో రెండు దఫాలుగా చర్చలు జరిగినా చివరకు ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పారు.


మరోసారి బోర్డు సమావేశం నిర్వహిస్తాం..

కేడీఎస్ నుంచి నీటి విడుదలపై త్వరలోనే మరోసారి బోర్డు సమావేశం నిర్వహిస్తామని ఏపీ ఈఎన్సీ నరసింహ మూర్తి తెలిపారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో కేడీఎస్ నీటి కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తెలంగాణ ముందుగానే ఎక్కువ నీటిని డ్రా చేయడం వల్ల తమకు ఇబ్బందులు వస్తున్నాయని వెల్లడించారు. కృష్ణా డెల్టా సిస్టమ్ KDS హక్కులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్‌లో 510 అడుగుల నుంచి 500 అడుగుల స్థాయి వరకు నీటిని డ్రా చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆ నీటి మట్టంలో దాదాపు 16 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని అన్నారు. పల్నాడు పవర్ గ్రిడ్‌పై ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని తేల్చిచెప్పారు. KDS నీళ్ల వాటాలో ఏపీ హక్కు ఉందని.. అందుకే తాము అడుగుతున్నామని తెలిపారు. త్వరలో మరోసారి బోర్డు మీటింగ్ పెడతామని ఏపీ ఈఎన్సీ నరసింహ మూర్తి పేర్కొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 07:18 PM