Share News

కేటీఆర్ పాదయాత్ర ఇప్పుడెందుకు.. కవిత ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:14 PM

పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎందుకు అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు.

కేటీఆర్ పాదయాత్ర ఇప్పుడెందుకు.. కవిత ప్రశ్నల వర్షం
Kavitha

హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇప్పుడు ఎందుకు అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు. తెలంగాణలో అన్నివర్గాలకు అధికారం రావాలన్నదే తన ధ్యేయమని వ్యాఖ్యానించారు. అందరికీ అధికారమని మాట్లాడుతారని.. దీనిని ఆచరణలోకి తీసుకురావాలని తాను ప్రారంభించాకే తనకు కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి పెట్టబోయే పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ఇచ్చారని తెలిపారు. ఈరోజు (శుక్రవారం) జాగృతి కార్యాలయంలో కవితను పలువురు కలిశారు. ఆమెను కలిసిన వారిలో సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు ఉన్నారు. ఈసమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.


సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా..

ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ.. సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ తన లక్ష్యమని.. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. మారోజు వీరన్న అనుచరుల మద్దతు ఎంతో శక్తిని ఇస్తుందని అన్నారు. తమతో మారోజు వీరన్న అనుచరులు కలవటమంటే ఇక తమను ఆపే శక్తే లేదని పేర్కొన్నారు. ఏదైనా శని ఉంటే.. అది తొలగిపోవడం కోసమే తాను వారణాసి వెళ్లి పూజలు చేశానని ప్రస్తావించారు. తాను పెట్టే పార్టీ సక్సెస్ కావాలని కోరుకున్నానని తెలిపారు. బీఆర్ఎస్‌కు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనను కలిశారని.. పేర్లు మాత్రం తాను బయటకు చెప్పనని అన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్‌ను ముందుగా టార్గెట్ చేశానని తెలిపారు. తనను ఆ పార్టీ సస్పెండ్ చేసిందని కవిత ప్రస్తావించారు.


అందుకే కాంగ్రెస్‌ను టార్గెట్ చేశా..

ప్రజా సమస్యలను పరిష్కరించేది అధికార పార్టీనేనని.. అందుకే కాంగ్రెస్‌ను టార్గెట్ చేశానని కవిత తెలిపారు. ఆయా సమస్యల ఆధారంగా బీఆర్ఎస్‌పైన కూడా మాట్లాడుతానని అన్నారు. పరిగిలో రైతు దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్నానని చెప్పి.. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ అయ్యారని తెలిపారు. ఆ సమయంలో హరీశ్‌రావు ఫోన్ చేస్తే పోలీసులు ఆయన ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేశారని విమర్శించారు. హరీశ్‌రావు పరిగిదాకా కూడా పోలేదని ఎద్దేవా చేశారు. తాము పరిగి వెళ్లి రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నామని స్పష్టం చేశారు. పోలీసులు తమను అరెస్టు చేశారని.. రైతులకు మద్దతుగా తాము నిలిచామని తెలిపారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఏ విధంగానైతే పోరాటం చేశామో...అదే విధంగా పరిగిలో కూడా పోరాటం చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తానని కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 05:22 PM