హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక
ABN , Publish Date - Apr 11 , 2026 | 02:39 PM
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తించామని అన్నారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు.
సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకోవద్దు..
మీ నీటి కనెక్షన్ కట్ చేస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లతో భయపడవద్దని అన్నారు. సైబర్ కేటుగాళ్లు పన్నే వలలో చిక్కుకోవద్దని చెప్పారు. వాటర్ బోర్డు పేరుతో జరుగుతున్న ఈ కొత్త సైబర్ మోసాలు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. ప్రజల భయాన్ని ఉపయోగించి వ్యక్తిగత సమాచారం, డబ్బును దోచుకునే ఈ తరహా స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా తమ కష్టార్జితాన్ని రక్షించుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు.
మోసగాళ్ల కొత్త పద్ధతి..
సైబర్ నేరగాళ్లు ముందుగా వినియోగదారులకు ఫోన్ చేసి, ‘మీ వాటర్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ విధంగా ప్రజల్లో భయాన్ని సృష్టించి, ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత ‘HMWSSB WATER BILL UPDATE.apk’ అనే పేరుతో ఒక అనుమానాస్పద లింక్‌ను పంపి, దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారని చెప్పారు. ఇది అసలు అధికారిక యాప్ కాకుండా మాల్వేర్‌తో కూడిన ఫేక్ APK ఫైల్ అని పోలీసులు హెచ్చరించారు.
APK ఫైల్ ద్వారా జరిగే ప్రమాదం..
ఈ ఫేక్ APK ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దీంతో వారు ఫోన్ కాల్స్‌ను డైవర్ట్ చేయగలరని, మెసేజ్‌లు, OTPలను చదవగలరని, బ్యాంకింగ్ యాప్‌లను గమనించాలన్నారు. యూజర్ తెలియకుండానే ట్రాన్సాక్షన్లు చేయగలరని చెప్పారు. ఈ విధంగా క్షణాల్లో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.
అధికారుల హెచ్చరికలు..
నగర పాలక సంస్థలు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఏ APK ఫైల్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయకూడదని స్పష్టం చేశారు. ప్రజలు తమ నీటి బిల్లులను కేవలం అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారానే చెల్లించాలని సూచించారు. అలాగే అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే వెంటనే స్పందించకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
సైబర్ మోసాల నుంచి రక్షణ చర్యలు..
ఈ తరహా మోసాల నుంచి రక్షణ పొందడానికి పోలీసులు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. అనుమానాస్పద APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయవద్దని అన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయవద్దని చెప్పారు. OTPలు ఎవరికీ షేర్ చేయవద్దని.. అధికారిక యాప్‌లు మాత్రమే ఉపయోగించాలని.. ఫోన్‌లో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ఉంచాలని పోలీసులు సూచించారు.
ఒకవేళ మోసపోతే ఏం చేయాలి..?
ఒకవేళ పొరపాటున లింక్ క్లిక్ చేసినా లేదా డబ్బులు పోగొట్టుకున్నా సెకను కూడా ఆలస్యం చేయకుండా ఈ చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
వెంటనే ఫిర్యాదు చేయండి: జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని అన్నారు.
ఆన్‌లైన్ ఫిర్యాదు: cybercrime.gov.in పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలని చెప్పారు.
బ్యాంక్ అప్రమత్తత: వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి మీ ఖాతాను లేదా కార్డులను బ్లాక్ చేయించాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News