Share News

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Aug 09 , 2026 | 03:51 PM

వృద్ధులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు.19 నెలల్లో సీనియర్ సిటిజన్ల నుంచి రూ.102.02 కోట్లను కేటుగాళ్లు కాజేశారని పేర్కొన్నారు.

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్
Hyderabad CP Sajjanar

హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వృద్ధులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) సూచించారు.19 నెలల్లో సీనియర్ సిటిజన్ల నుంచి రూ.102.02 కోట్లను సైబర్ క్రిమినల్స్ కాజేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల పరిధిలో 19 నెలల్లో 403 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఈరోజు (ఆదివారం) హైదరాబాద్‌లో మీడియాతో సీపీ సజ్జనార్ మాట్లాడారు. 2025 జనవరి నుంచి 2026 జులై 31వ తేదీ వరకు గణాంకాలను వెల్లడించారు. ట్రేడింగ్ ఫ్రాడ్‌లలో రూ.55.88 కోట్లను బాధితులు నష్టపోయారని తెలిపారు. ట్రేడింగ్ మోసాలకు సంబంధించి 113 కేసులు నమోదు చేశామని చెప్పుకొచ్చారు. వాట్సాప్, టెలిగ్రామ్‌లలో పార్ట్‌టైమ్ జాబ్స్, భారీ లాభాల పేరుతో సైబర్ క్రిమినల్స్ వల వేస్తారని పేర్కొన్నారు.


నకిలీ యాప్‌లతో డబ్బులు కాజేస్తారు..

నకిలీ యాప్‌లలో లాభాలు వచ్చినట్లుగా సైబర్ క్రిమినల్స్ చూపించి డబ్బులు కాజేస్తారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 69 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రూ.31.93 కోట్లను వృద్ధులు నష్టపోయారని చెప్పారు. పోలీస్, సీబీఐ ఈడీ, కస్టమ్స్ అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి ఆయా కేసులు, అరెస్టుల పేరుతో బెదిరించి భారీగా సైబర్ కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఓటీపీ మోసాల్లో 115 కేసులు నమోదు చేశామని.. ఈ కేసులో రూ.4.94 కోట్లను వృద్ధులు పోగొట్టుకున్నారని వెల్లడించారు. ఆకర్షణీయమైన వడ్డీల పేరుతో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లు చేస్తున్నారని చెప్పారు.పెట్టుబడి మోసాల్లో 22 కేసులు నమోదు చేశామని తెలిపారు. దీని ద్వారా రూ. 2.79 కోట్లను బాధితులు నష్టపోయారని చెప్పారు. డేటింగ్ ఫ్రాడ్, హనీట్రాప్‌లతోనూ వృద్ధులకు వల వేస్తున్నారని తెలిపారు.


సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు..

7 కేసుల్లో రూ.70.11 లక్షలకు పైగా వృద్ధులు పోగొట్టుకున్నారని సీపీ సజ్జనార్ అన్నారు. ఒంటరితనాన్ని సైబర్ క్రిమినల్స్ ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుంటున్నారని తెలిపారు. గిఫ్టులు, కస్టమ్స్ డ్యూటీ, అత్యవసర ఖర్చుల పేరుతో డబ్బులు దోపిడీ చేస్తున్నారని అన్నారు. పరువు పోతుందనే భయంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. మరోవైపు పోలీసులు అవగాహన కార్యక్రమాలను విసృత్తంగా నిర్వహిస్తున్నారని.. దీని ద్వారా సీనియర్ సిటిజన్ల సైబర్ మోసాలు తగ్గాయని వెల్లడించారు.


సొమ్ము రికవరీకి చర్యలు..

2025లో 285 కేసులు నమోదయ్యాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసుల్లో రూ. 71.81 కోట్లను బాధితులు నష్టపోయారని అన్నారు. 2026 తొలి 7 నెలల్లో 118 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ కేసులో రూ.30.20 కోట్లను బాధితులు నష్టపోయారని చెప్పారు. నెలకు సగటున 24 కేసుల నుంచి 17 వరకు తగ్గాయని అన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేస్తూ చర్యలు చేపడుతున్నామని వివరించారు. సొమ్ము రికవరీకి త్వరితగతిన సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వృద్ధుల ఫోన్ వినియోగం, బ్యాంక్ లావాదేవీలపై పిల్లల పర్యవేక్షణ అవసరమని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్

మాకు క్షుద్ర రాజకీయాలు తెలియవు: కేటీఆర్‌

సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 09 , 2026 | 05:44 PM