Share News

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Aug 08 , 2026 | 02:41 PM

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి.. జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు.

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్
Hyderabad CP Sajjanar

హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి.. జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమ్మాయిలు, యువతులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త డేటింగ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఆకర్షణీయమైన పోస్టర్లతో సైబర్ క్రిమినల్స్ యువతులకు వల వేస్తున్నారని తెలిపారు. ‘1st August Special – 50% OFF’ అంటూ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారని చెప్పుకొచ్చారు. కాఫీ డేట్ - రూ.499, సినిమా డేట్ - రూ.1,249 అంటూ ప్యాకేజీలు ప్రకటించారని తెలిపారు. షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడుగా వస్తామంటూ వివిధ ధరలతో సైబర్ క్రిమినల్స్ ఆఫర్లు ఇచ్చారని వెల్లడించారు.


తియ్యటి మాటలతో మోసం..

పదిగంటల ఫుల్ డే ప్యాకేజీ రూ.4,499 అంటూ సైబర్ కేటుగాళ్లు ప్రచారం చేశారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఏఐతో రూపొందించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ యువకుల ఫొటోలతో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించారని చెప్పుకొచ్చారు. ఈ మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో చాటింగ్ చేస్తారని.. ఆపై అసలు మోసం ఉంటుందని అన్నారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తారని చెప్పుకొచ్చారు. డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలను సైబర్ కేటుగాళ్లు దోచుకుంటున్నారని వెల్లడించారు.


వ్యక్తిగత వివరాలు, ఫొటోలు షేర్ చేయొద్దు..

డబ్బులు తీసుకున్న తర్వాత అకౌంట్లు బ్లాక్ చేసి సైబర్ క్రిమినల్స్ మాయం అవుతారని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. చాటింగ్ సమయంలో సేకరించిన ఫోన్ నంబర్లు, ఫొటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. అపరిచిత వ్యక్తులను నమ్మి నేరుగా కలిస్తే ట్రాప్ చేసే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారని వివరించారు. మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్‌పై వేగంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి ముందస్తుగా ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని వార్నింగ్ ఇచ్చారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు షేర్ చేయొద్దని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల సోషల్ మీడియా, ఆన్‌లైన్ పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు.


వార్తలు కూడా చదవండి...

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు

జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 04:44 PM