క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Aug 06 , 2026 | 02:23 PM
మాజీమంత్రి హరీశ్‌రావుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షుద్ర పూజల విషయంలో ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు వెళ్లిన గుడులు క్షుద్ర పూజలకు ఫేమస్ అని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి హరీశ్‌రావుపై (Harish Rao) టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షుద్ర పూజల విషయంలో ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు వెళ్లిన గుడులు క్షుద్ర పూజలకు ఫేమస్ అని చెప్పుకొచ్చారు. ఆయన ఎందుకు అక్కడ పూజలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈరోజు (గురువారం) గాంధీభవన్‌లో మీడియాతో మహేశ్ గౌడ్ మాట్లాడారు. తాను ఆయనను కించపరచలేదని స్పష్టం చేశారు. లీగల్ నోటీసులకు తాము భయపడమని అన్నారు.
హరీశ్‌రావుపై తప్పుడు ప్రచారం చేయలేదు..
తాను హరీశ్‌రావు గురించి అబద్ధాలు చెప్పలేదని మహేశ్ గౌడ్ అన్నారు. ఏమైనా ఉంటే న్యాయస్థానంలో కొట్లాడుతామని చెప్పుకొచ్చారు. తాను హరీశ్‌రావుపై తప్పుడు ప్రచారం చేయలేదని తేల్చిచెప్పారు. ఆయన ఎందుకు ఆ గుడులకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రానికి ఎవరు శనో, ఎవరు దరిద్రమో ప్రజలు ఎన్నికల్లో తేల్చారని తెలిపారు. తమకు మూఢనమ్మకాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ త్యాగాల గురించి తెలుసుకోవాలని అన్నారు. తమపై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు అవకాశం ఉందని చెప్పారు.
నాకు, సీఎంకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు: మహేశ్ కుమార్ గౌడ్
తనకు, సీఎం రేవంత్‌రెడ్డికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మహేశ్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు. సీఎం, తాను రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటామని అన్నారు. నిన్న కూడా సీఎంతో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. కో ఆర్డినేషన్ కమిటీకి అన్ని చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదన్నారు. తాము సీఎంని గౌరవిస్తామని స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదని.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని తెలిపారు.
అరవింద్, సంజయ్ చిన్నపిల్లలు..
తన ఆడియోలు, వీడియోలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని.. దమ్ముంటే అవి బయట పెట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. సీఎంకు, తనకు మంచి సఖ్యత ఉందని తెలిపారు. దొంగ చాటున ఫిర్యాదులు చేసుకునే అవకాశం కాంగ్రెస్‌లో లేదని స్పష్టం చేశారు. ఏమున్నా తాము ముఖంపైనే మాట్లాడుకుంటామని అన్నారు. బయట జరుగుతున్న విషయాలను కూడా తాము చర్చించుకుంటామని తెలిపారు. కో ఆర్డినేషన్ కమిటీలో కీలక అంశాలపై చర్చ జరిగిందని చెప్పారు. బీజేపీ ఎంపీ అరవింద్ మాటలు నీటి మూటలని ఎద్దేవా చేశారు. తన ముందు అరవింద్, సంజయ్ చిన్నపిల్లలని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News