Share News

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

ABN , Publish Date - Aug 05 , 2026 | 09:40 AM

క్షుద్రపూజలు ఎందుకు చేశావంటే మాజీ మంత్రి హరీశ్‌రావు తమకు లీగల్ నోటీసులు పంపుతున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి ద‌యాక‌ర్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌తో సహా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపారని ధ్వజమెత్తారు.

 క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్
Addanki Dayakar

హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): క్షుద్రపూజలు ఎందుకు చేశావంటే మాజీ మంత్రి హరీశ్‌రావు తమకు లీగల్ నోటీసులు పంపుతున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి ద‌యాక‌ర్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌తో సహా ఎవరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపారని ధ్వజమెత్తారు. హరీశ్‌రావు లీగల్ నోటీసులకు లీగల్‌గానే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) గాంధీభవన్‌లో మీడియాతో అద్దంకి ద‌యాక‌ర్ మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తమను జైళ్లలో పెట్టినా పోరాటాలు చేశామని తెలిపారు. ఆయన ఎందుకు భయపడుతున్నారు?, ఆ అవసరం ఎందుకొచ్చిందో ఆలోచించుకోవాలని అన్నారు. గత ఏడాది శివమొగ్గకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ ఆఫీసులో పోలీస్ అధికారిగా చెప్పుకొని ఆయన వెళ్లాడనే సమాచారం తమకు ఉందని తెలిపారు. పవిత్ర క్షేత్రాల దగ్గరే క్షుద్రశక్తుల పూజలు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. రెండోసారి క్షుద్రపూజలకు హరీశ్‌రావు సిద్ధమవుతున్నారనే సమాచారంతోనే తాము గత విషయాలను బయటపెట్టామని పేర్కొన్నారు.


లీగల్ నోటీసులకు భయపడేవాళ్లం కాదు..

అమ్మవారి మీద ప్రమాణం చేసి క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు చెప్పగలుగుతారా? అని అద్దంకి ద‌యాక‌ర్ ప్రశ్నించారు. హరీశ్‌రావు లీగల్ నోటీసులకు తాము భయపడేవాళ్లం కాదని చెప్పారు. కోర్టులు, రాజ్యాంగం మీద తమకు నమ్మకం ఉందని తెలిపారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని అన్నారు. పిచ్చి ప్రేలాపనలు చాలామంది చేస్తున్నారని... తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. క్షుద్రపూజలు లాంటి పనికిమాలిన పనులు చేసినప్పుడు మందలించాల్సింది పోయి తమను విమర్శిస్తున్నారా? అని దుయ్యబట్టారు. తెలంగాణలో శాంతి, ప్రజల మంచి కోసం పూజలు చేసినట్లు ఆయన మాట్లాడుతున్నారా.? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా హరీశ్‌రావు తన తప్పు తెలుసుకోవాలని హితవు పలికారు. అఘోర కాళీ అమ్మవారిపై ప్రమాణం చేసి తాను ఎలాంటి పూజలు చేయలేదని చెప్పాలని అన్నారు. లేదంటే తెలంగాణ సమాజానికి అఘోర కాళీ దేవాలయం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.


ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ కమెడియన్..

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏ గుడి ఎక్కడుందో కూడా ఆయనకు తెలియడం లేదని అద్దంకి ద‌యాక‌ర్ విమర్శించారు. తాము తిరుచ్చి అఘోర కాళీ గురించి మాట్లాడుతుంటే, ఆయన ఘట్‌కేసర్ కాళీ ఆలయం గురించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రవీణ్ కుమార్ పొలిటికల్ కమెడియన్ అని సెటైర్లు గుప్పించారు. ఆయన వ్యవహారాల గురించి అమెరికాలో కూడా చర్చ జరుగుతోందని అన్నారు. తన గొంతు నిజాయితీతో కూడిందని చెప్పుకొచ్చారు. తాను ఒక ప్రకటన చేశానంటే అందులో చిత్తశుద్ధి ఉంటుందని తెలిపారు. తాను పీడితుల కోసం కొట్లాడానని చెప్పారు. హరీశ్‌రావు, ఆయన మామ, బావమరిది ఇంట్లో పడుకునప్పుడు తాను తెలంగాణ కోసం కొట్లాడానని వ్యాఖ్యానించారు. చిల్లరగాళ్లతో సోషల్ మీడియాలో తన గురించి ట్రోల్ చేస్తే భయపడతానా? అని ప్రశ్నించారు.


హరీశ్‌రావు మీద జాలి, సానుభూతి కలుగుతోంది..

హరీశ్‌రావు మీద జాలి, సానుభూతి కలుగుతోందని అద్దంకి ద‌యాక‌ర్ చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి హరీశ్‌రావును పక్కన పెట్టారని ఆరోపించారు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసునని అన్నారు. బేతాళ మాంత్రికుడిలా హరీశ్‌రావు వ్యవహారిస్తున్నారని సెటైర్లు గుప్పించారు. ప్రజలను ప్రేమించడం ఆయన తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఛిద్రమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తమ ముఖ్యమంత్రి సరిదిద్దే పనిలో ఉన్నారని తెలిపారు. ఆయనకు చెడ్డపేరు రావాలని, వర్షాలు రావొద్దని హరీశ్‌రావు పిచ్చి పూజలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


వార్తలు కూడా చదవండి...

మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్‌రెడ్డి బదిలీ చేశారు: కిషన్‌రెడ్డి

తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు

మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 10:57 AM