శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - Jul 22 , 2026 | 08:26 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ యువతిపై క్యాబ్‌డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్, జులై 22 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ యువతిపై క్యాబ్‌డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని శంషాబాద్‌లోని సిద్ధాంతి వద్ద గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ఉద్యోగినిగా ఆ యువతి పనిచేస్తోంది. రోజు మాదిరిగానే నైట్‌షిఫ్ట్ కోసం క్యాబ్‌లో ఆమె విమానాశ్రయానికి బయలు దేరింది. ప్రయాణ మధ్యలో క్యాబ్‌డ్రైవర్ ఎర్రపోగు ప్రశాంత్ కుమార్ (23) కారును అసలు మార్గం నుంచి కాకుండా దారిమళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి కారు దిగాడు. ఆ తర్వాత వెనుక సీటు వైపు నుంచి తిరిగి కారులోకి ప్రవేశించి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇండిగో ఉద్యోగిని ప్రతిఘటించడంతో క్యాబ్‌డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటన అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. గంటల వ్యవధిలోనే ఎర్రపోగు ప్రశాంత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మహిళలు రాత్రి వేళల్లో లేదా ఒంటరిగా ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ
ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News