దమ్ముంటే నా విచారణ వీడియో ఫుటేజ్ బయటపెట్టాలి: హరీశ్‌రావు
ABN , Publish Date - Jan 20 , 2026 | 07:28 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దగ్గర ఒక్క ఆధారమూ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. అన్నీ నిరాధారమైన ఆరోపణలు.. సొల్లు పురాణమేనని ఎద్దేవా చేశారు. ఈ కేసులో అడిగిన ప్రశ్నలే అడిగారు తప్ప.. మరేమీ లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి20(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సిట్ అధికారుల విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన.. కేటీఆర్ సహా ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దగ్గర ఒక్క ఆధారమూ లేదని తెలిపారు. అన్నీ నిరాధారమైన ఆరోపణలు.. సొల్లు పురాణమేనని ఎద్దేవా చేశారు. ఈ కేసులో అడిగిన ప్రశ్నలే అడిగారు తప్ప.. మరేమీ లేదని స్పష్టం చేశారు. సిట్ గంట సేపు ప్రశ్నించడం.. మరో గంట సేపు ఫోన్ వచ్చిందని బయటికెళ్లడమే జరిగిందని తెలిపారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే విచారణకు పిలిచారని విమర్శించారు.
అందుకే విచారణకు పిలిచారు..
నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అవినీతిని బయటపెట్టినందుకే విచారణకు పిలిచారని హరీశ్‌రావు పేర్కొన్నారు. బొగ్గు అవినీతిలో మొదటి లబ్ధిదారుడు రేవంత్ బామ్మర్దేనని ఆరోపించారు. రేవంత్ బామ్మర్ది రూ.వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. సైట్ విజిట్ పేరుతో జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టామని వెల్లడించారు. దమ్ముంటే కమిషన్‌తో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. తనను అక్రమ కేసులో ఇరికించాలని చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే.. తనను అక్రమ అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. తనను ఘోష్ కమిషన్ విచారణకు పిలిపించారని తెలిపారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ మరో విచారణకు పిలిచారని తెలిపారు. అయినా రేవంత్‌రెడ్డిని వదలబోనని.. ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని హెచ్చరించారు.
దోపిడీని ఎండగడతా..
హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ హామీలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటాం. మీ దోపిడీని ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం, ప్రజాకోర్టులో మీకు శిక్ష తప్పదు. రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. అందినకాడికి దండుపాళ్యం బ్యాచ్ దోచుకుంటున్నారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు సిట్ విచారణ పేరుతో డ్రామాను తెరమీదకు తెచ్చారు. సిట్ విచారణ పెద్ద ట్రాష్. చట్టంపై మాకు గౌరవం ఉంది.. ఎన్నిసార్లయినా విచారణకు వెళ్తా. నోటీసులకు మేం భయపడం. దర్యాప్తు పేరుతో ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. మీ మాదిరి వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు మాకు తెలియవు. విచారణలో ఏమీ తేల్చలేక.. లీకులు ఇస్తారు. దమ్ముంటే నా విచారణ వీడియో ఫుటేజ్ బయటపెట్టాలి. మీ పతనం దిశగా మీరే అడుగులు వేస్తున్నారు’ అని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
సీఎం రేవంత్‌రెడ్డితో యూఏఈ మంత్రి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
హరీశ్‌రావును జైలుకు పంపాలని తహతహలాడుతున్నారు.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Read Latest Telangana News And Telugu News