మేడారం జాతరకు 4,000 ప్రత్యేక బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:51 PM
తెలంగాణలోని మేడారం జాతరకు రాష్ట్రంలోని 51 సెంటర్ల నుంచి 4వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మేడారానికి వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి20(ఆంధ్రజ్యోతి): మేడారం జాతరకు (Medaram Jatara) రాష్ట్రంలోని 51 సెంటర్ల నుంచి 4వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. మేడారానికి వెళ్లే మహిళలకు సైతం ఉచిత ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. రవాణా శాఖ నుంచి 10, 441 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం జాతరకు ఆర్టీసీ సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ ఈడీలు, ఆర్ఎంలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
అప్పటి వరకు స్పెషల్ బస్సులు..
మేడారం విధుల్లో 7వేల మంది డ్రైవర్లు - 18 మంది కండక్టర్లు, 800 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 28వ తేదీ నుంచి 1వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుపుతామని చెప్పుకొచ్చారు. మేడారం వెళ్లేటప్పుడు బస్సులు నిండుతాయని... వచ్చేటప్పుడు ఖాళీగా బస్సులు వస్తాయని తెలిపారు. వన్ వేలో బస్సులు ఖాళీగా వెళ్తాయి కాబట్టి... రెగ్యులర్ ఛార్జీల కంటే 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తారని పేర్కొన్నారు.
20 లక్షల మంది ప్రయాణం..
ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మేడారంలో 50ఎకరాల్లో వెయ్యి బస్సులు నిలిపేలా తాత్కాలిక బస్ షెల్టర్స్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నిమిషానికి నాలుగు బస్సులు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. బస్ షెల్టర్ల వద్ద 9 కిలోమీటర్ల మేర 50 క్యూ లైన్స్ ఏర్పాటు చేశామని అన్నారు. బస్టాండ్స్‌లో క్లోజ్డ్ సర్క్యూట్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావును జైలుకు పంపాలని తహతహలాడుతున్నారు.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్
Read Latest Telangana News And Telugu News